తెలుగు సినిమాలో వేరే భాష హీరోయిన్ నటించడం పెద్ద విషయమా? గత కొన్ని దశాబ్దాలుగా ఇది చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్ నుండి కథానాయికలు వచ్చి మన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌కి మన తెలుగు అమ్మాయిలు, నార్త్ వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ భాష అమ్మాయి, ఆ భాషలోనే నటించాలి అనే రూల్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. కానీ ఇటీవల మలయాళ గాయని మాట్లాడారు.
‘పరమ్ సుందరి’ సినిమాతో త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఇందులో సుందరి దామోదరం పిళ్లైగా జాన్వీ, పరమ్ సచ్‌దేవ్‌గా సిద్ధార్థ్ నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఉత్తరాదికి చెందిన జాన్వీని మలయాళ యువతిగా చూపించడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ బ్యాక్‌డ్రాప్ సినిమాలో నటించడానికి మలయాళ హీరోయిన్స్ లేరా? అని గాయని పవిత్రా మేనన్ ప్రశ్నించారు.
సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ మాట్లాడింది. అవును నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ, కేరళ సంస్కృతి అంటే ఆసక్తి చూపిస్తాం. మలయాళ సినిమాలకు నేను అభిమానిని. ‘పరమ్ సుందరి’లో నేను మలయాళ అమ్మాయిగానే కాదు, తమిళ అమ్మాయిగానూ కనిపిస్తాను అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జాన్వీ కపూర్. ఈ నేపథ్యంలో సుందరి మీద విమర్శలు ఆగుతాయేమో చూడాలి.
కేరళ యువతి, దిల్లీ యువకుడి ప్రేమ కథే ‘పరమ్ సుందరి’. సినిమా ట్రైలర్‌లోని ‘కేరళ.. మలయాళం మోహన్ లాల్, తమిళనాడు.. తమిళ్ రజనీకాంత్, ఆంధ్ర.. తెలుగు అల్లు అర్జున్, కర్ణాటక.. యష్’’ అంటూ జాన్వీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ లాంటి విజయం అందుకుంటుందో చూడాలి.