జయలలిత బయోపిక్ గురించి ఆసక్తికర అప్డేట్
- August 20, 2018 / 01:04 PM ISTByFilmy Focus
ప్రముఖ నటి, తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే జయలలిత బయోపిక్ పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మేము తీస్తామంటే మేము తీస్తాము అంటూ .. అనేక నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్ వారు జయలలిత బయోపిక్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి సిద్ధమయ్యారు. విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఓ తమిళ దర్శకురాలు రంగంలోకి దిగింది. ఈమె కూడా అదే ఫిబ్రవరి 24న జయలలిత బయోపిక్ ను ప్రారంభిస్తానని ప్రకటించింది.
తాజాగా లెజెండరీ దర్శకుడు భారతీ రాజా జయలలిత బయోపిక్ ని తీస్తానని వెల్లడించారు. భారతీ రాజా జయలలిత బయోపిక్ కోసం అమ్మ, పురిచ్చి తలైవి అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగితే జయలలిత బయోపిక్ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇదివరకు జయలలిత పాత్ర కోసం బరిలో విద్యా బాలన్, కీర్తి సురేష్, నయనతార పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఐశ్వర్యారాయ్, అనుష్క పేర్లు వినిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఓకే అయితే.. ఈ బయోపిక్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ముందో కొన్ని రోజుల్లో తెలియనుంది.















