సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ జయలలితా ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. రాజకీయ వ్యక్తి నుంచి శక్తిగా మారిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. అందుకే ఆమెను తమిళనాట జనాలు, పోలీటికల్ లీడర్లందరూ ఆప్యాయంగా “అమ్మ” అని పిలుచుకొంటారు. ఆమె మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకూ తీరని లోటు. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కించి భావితరాలకు ఆమె గొప్పతనాన్ని ఆమె సాధించిన ఘనతలను పరిచయం చేయాలని కంకణం కట్టుకొంది తమిళ చిత్రసీమ. ఆమెకు తెలుగు, తమిళ భాషల్లోనూ విశేషమైన ఫాలోయింగ్ ఉండడంతో జయలలిత బయోపిక్ ను తెలుగు-తమిళ-హిందీ భాషాల్లో ఏకకాలంలో తెరకెక్కించాలనుకొన్నారు.
ఈమేరకు ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తున్న విబ్రి మీడియా అమ్మ పార్టీ సభ్యులు మరియు కుటుంబ సభ్యుల నుంచి పర్మిషన్ తీసుకొని జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని ప్రారంభించాలని కూడా ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించనుండగా.. విద్యాబాలన్ కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పుడు వీళ్ళకి పోటీగా ఓ తమిళ దర్శకురాలు రంగంలోకి దిగింది. ఈమె కూడా అదే ఫిబ్రవరి 24న జయలలిత బయోపిక్ ను ప్రారంభిస్తానని ప్రకటించింది. ఒకరి జీవితం రెండుమూడు సినిమాలు రూపొందడం అనేది పెద్ద విషయం కాకపోయినా.. ఒకేరోజు రెండు సినిమాలు మొదలవ్వడం అనేది మాత్రం ఇదే ప్రప్రధమం. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదలవుతుందో చూడాలి.