ఇండియన్ సినిమా చరిత్రలో సస్పెన్స్ చిత్రాలు, థ్రిల్లర్ కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో వాటికి స్టార్ కలర్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్. ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. రెండికి రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో రానున్న మూడో ‘దృశ్యం’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సారి దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ఒకేసారి రానుంది. అయితే సినిమా గురించి దర్శకుడు జీతూ జోసెఫ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇక చాలు అని షాకింగ్ కామెంట్లు చేశారు జీతూ జోసెఫ్. సస్పెన్స్ – థ్రిల్లర్స్ సినిమాలు ఇక చాలు అనిపించిందని, నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో కొత్తగా ప్రయత్నిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన ప్రయత్నం ఫెయిల్ అయినా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచానన్న తృప్తి ఉంటుందని చెప్పారు జీతూ. అలాగే ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలకు భిన్నంగా ‘దృశ్యం 3’ సినిమా ఉంటుందని కూడా చెప్పారు. అంటే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాలుగో సినిమా వచ్చే అవకాశం లేనట్లే అంటున్నారు.
ఎందుకంటే ‘దృశ్యం 4’ ఉంటుందా? అని అడిగితే ఏమో చెప్పలేను అనే సమాధానం ఇచ్చారు జీతూ జోసెఫ్. కెరీర్ ప్రారంభంలో ‘మై బాస్’, ‘మమ్మీ అండ్ మీ’ అంటూ ఎంటర్‌టైన్మెంట్ పుష్కలంగా ఉండే సినిమాలే చేశారు జీతూ జోసెఫ్. ‘దృశ్యం’ సినిమా తర్వాత పూర్తిగా ఇటువైపు వచ్చేశారు. మరీ ఒకే తరహా సినిమాలు అంటే ముఖం మొత్తేస్తుందని జీతూ అనుకున్నారేమో. లేదంటే ప్రేక్షకులు అలా అనుకుంటారు అని ముందుగానే ఆయన రియాక్ట్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది.
‘దృశ్యం 3’ సినిమా పూర్తయి కొత్త సినిమాను ఆయన అనౌన్స్ చేసినప్పుడు ఈ సంగతిలో క్లారిటీ వస్తుంది. ఆయన ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో కెరీర్ ప్రారంభించారు కాబట్టి మళ్లీ అటువైపు ఏమన్నా వెళ్తారేమో చూడాలి.