తెలుగు చిత్ర పరిశ్రమ రోజురోజుకి అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతోంది. పరభాషా కథలతో విజయాలు అందుకునే పరిశ్రమ అనే మచ్చని పోగొట్టుకొని.. ఎన్నో చిత్ర పరిశ్రమలకి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎల్లలను చెరిపివేస్తూ.. అందరితో అభినందనలు అందుకోవడమే కాదు.. జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంటోంది. నిన్న భారతీయ ప్రభుత్వం ప్రకటించిన 65వ జాతీయ అవార్డుల జాబితాలో తెలుగు చిత్రాలు ఘాజి, బాహుబలి 2 ఉండడం అందరికీ సంతోషం కలిగించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నేషనల్ అవార్డును అందుకోగా.. బాహుబలి-2 మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ప్రతి ఒక్కరు తమ సినిమాకి వచ్చినట్టుగా ఆనందపడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “”బాహుబలి 2 “, “ఘాజీ” సినిమా టీమ్‌లకు అభినందనలు. తెలుగు సినిమా గర్వపడేలా చేశారు” అంటూ ట్వీట్ చేశారు.
మీ చర్యలతో థ్రిల్ చేశారు : రాజమౌళి
‘‘ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సాధించినందుకు మన ‘బాహుబలి2’ చిత్ర బృందానికి అభినందనలు. మా యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగం ప్రతిభను గుర్తించిన అవార్డుల కమిటీకి ధన్యవాదాలు.‘రానా దగ్గుబాటి, సంకల్ప్, పీవీపీ సినిమాకు శుభాకాంక్షలు. మీ చర్యలతో మమ్మల్ని థ్రిల్‌కు గురిచేశారు.” – రాజమౌళి
ఈ ప్రయాణం మర్చిపోలేను…
‘‘కథే మూలం.. కథే బలం’ ఇలాంటి అద్భుతమైన కథల్లో నేనూ ఓ భాగం అయినందుకు, ఈ ప్రయాణానికి ఎంతో సంతోషిస్తున్నా. ఈ చిత్రాల ద్వారా నాకు ఎంతో నేర్పిన దర్శకులు రాజమౌళి, సంకల్ప్‌లకు ధన్యవాదాలు. ఈ సినిమాల ప్రయాణం నేను మర్చిపోలేను’’ – రానా దగ్గుబాటి