జువ్వ

  • February 24, 2018 / 05:58 AM IST

ప్రముఖ రాజకీయ నాయకుడు బోత్స సత్యనారాయణ అల్లుడు భరత్ సోమ్మి తన తమ్ముడు రంజిత్ సొమ్మిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “జువ్వ”. “దిక్కులు చూడకు రామయ్య” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి సీనియర్ అసిస్టెంట్ త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. తొలి చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకొన్న త్రికోటి మలి చిత్రంతో ఏమేరకు ప్రూవ్ చేసుకొన్నాడో చూద్దాం..!!

కథ : శ్రుతి (పలక్ లల్వాని) స్కూల్ టైమ్ లోనే బసవరాజు (అర్జున్) అనే కుర్రాడి కారణంగా భయపడి సొంత ఊరు నుంచి పారిపోయి హైద్రాబాద్ లో పేరు మార్చుకొని మరీ నివసిస్తుంటుంది. హైద్రాబాద్ లో అవారాగా తిరుగుతూ కుదిరినప్పుడల్లా జనాల్ని మోసం చేసి ఆ డబ్బుతో స్నేహితులతో కలిసి బ్రతికేస్తుంటాడు రాణా (రంజిత్ సొమ్మి). తనను స్కూటీతో గుద్ది వెళ్ళిపోయిన శ్రుతితో ప్రేమలో పడతాడు రాణా. ఆ తర్వాత శ్రుతికి బసవరాజు వల్ల ప్రాణహాని ఉందని తెలుసుకొని తన తెలివితేటలను ఉపయోగించి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకొన్నాడు అనేది “జువ్వ” కథాంశం.

నటీనటుల పనితీరు : పరిచయ చిత్రమైనప్పటికీ.. చాలా మంది నటవారసులకంటే బెటర్ అనిపించుకొన్నాడు రంజిత్. డ్యాన్స్ విషయంలో పర్వాలేదు అనిపించుకొన్నా.. హావభావాల ప్రదర్శన విషయంలో మాత్రం ఇంకా వర్కవుట్ చేయాల్సి ఉంది. పలక్ లల్వాని అందం, అభినయంతో అలరించింది. అమ్మడు కాస్త కాన్సన్ ట్రేట్ చేస్తే హీరోయిన్ గా రాణించగల అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రతినాయకుడిగా బసవరాజు పాత్రలో నటించిన అర్జున్ మంచి మార్కులు కొట్టేశాడు. విలనిజాన్ని వీరాలెవల్లో కాకపోయినా తన మినేసింగ్ లుక్స్ తో కథ నడపడానికి తోడ్పడ్డాడు. ఇంకా సినిమాలో బోలెడంత మంది ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికీ.. వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం మాత్రమే కాక పెద్దగా డెప్త్ కూడా లేకపోవడంతో వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.

సాంకేతికవర్గం పనితీరు : కీరవాణి బాణీలు ఆయన స్థాయిలో లేవు, నేపధ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. త్రికోటి మీద గౌరవంతో ఈ సినిమా ఒప్పుకొన్నారో ఏమో కానీ.. ఆయన మనసు పెట్టి చేయలేదనిపిస్తుంది. సురేష్ సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. అనవసరమైన్ “లో యాంగిల్” షాట్స్, స్లోమోషన్ షాట్స్ తో కాస్త తలపోటు తెప్పించాడు.

“దిక్కులు చూడకు రామయ్య” చిత్రంలో ఒకే అమ్మాయిని తండ్రీకొడుకులిద్దరూ లవ్ చేస్తే ఎలా ఉంటుందో అనే చాలా సెన్సిబుల్ కాన్సెప్ట్ ను ఎంతో నేర్పుతో డీల్ చేసిన దర్శకుడు త్రికోటి “జువ్వ” విషయంలో కథనాన్ని కాక కేవలం మాస్ ఎలిమెంట్స్ ను నమ్ముకోవడంతో దర్శకుడిగా ఆయన కెరీర్ కి ఈ సినిమా ఓ మచ్చలా మిగిలింది. ఎం.రత్నం అందించిన కథలో చిన్నప్పటి ఎపిసోడ్స్ ను బాగా డీల్ చేసిన త్రికోటి ఆ తర్వాత జరిగే కథను నడపడం కోసం కమర్షియల్ అంశాలు, అనవసరమైన సన్నివేశాలు, కుళ్ళు జోకుల మీద ఆధారపడడంతో కథనం ఘాట్ రోడ్ ప్రయాణంలా సాగింది.

విశ్లేషణ : ఇంట్రడక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, కాస్ట్యూమ్స్, ప్రమోషన్స్, ఆడియో ఫంక్షన్ చేయడం కోసం పెట్టిన ఖర్చులో పావలా వంతైనా మంచి కథ, కథనం కోసం పెట్టి ఉంటే దర్శకనిర్మాతలు, హీరోహీరోయిన్లు మాత్రమే కాక థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా సంతోషపడి ఉండేవాడు. సో, ప్రేక్షకుడి సహనాన్ని తిక్క స్క్రీన్ ప్లేతో, రొటీన్ కథ, క్లైమాక్స్ తో పరీక్షించే “జువ్వ” చిత్రానికి దూరంగా ఉండడం సబబు.

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus