ఒకప్పటి స్టార్ హీరో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి నాలుగవ కూతురు కంటమనేని ఉమా మహేశ్వరి ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె హఠాన్మరణానికి కారణాలు ఏంటి అన్నది అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు ఆమె నాలుగో కుమార్తె అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా.. కంటమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె డిప్రెషన్ కు గురవ్వడంతో ఆమె తన గదిలో ఉన్న ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయినట్లు ఈ వార్తల సారాంశం. అయితే ఇది నిజం కాదు అనే వారు కూడా ఉన్నారు. తాజాగా ఈ వార్తలపై ఆమె కూతురు దీక్షిత క్లారిటీ ఇచ్చింది. ‘అనారోగ్య సమస్యల కారణంగానే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది.
ఆ సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నాము.ఆ టైంలో మేము భోజనం చేద్దాం అని అనుకుంటున్నాం. మధ్యాహ్నం 12 గంటల టైంలో మా అమ్మ గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నారు. ఎంతసేపటికి ఆమె భోజనానికి రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశాం. మాకు సాధ్యపడకపోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఉమా మహేశ్వరి ఆత్మహత్య వార్తలు నిజమే అని దీక్షిత ఖరారు చేసింది.
ఉమా మహేశ్వరి జీవితంలో చాలా ట్రాజెడీ ఉంది. ఈమెకి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త నరేంద్ర రాజన్ ఓ శాడిస్ట్. ఈమెను సిగరేట్లతో కాల్చడం వంటివి చేసి చాలా హింసించేవాడు. ఈ విషయం చివరికి రామారావుగారికి తెలియడంతో విడాకులు ఇప్పించి కంటమనేని వారి ఇంటికి కోడలిగా చేశారట.మొదటి భర్త ఎంత హింసించినా ఆమె తన పుట్టింటి వారికి చెప్పేది కాదట. అయితే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె జీవితం ఇలా మధ్యలోనే రాలిపోవడం విషాదకరం.