KA10 అంటూ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) & టీమ్ గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. “క” (KA) సినిమా హిట్ తర్వాత కిరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది, దాంతో ఈ కొత్త సినిమా ఏమిటబ్బా అని ఎదురుచూస్తున్నారు జనాలు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది కొత్త సినిమా కాదు. 2022లో మొదలుపెట్టి, 2023లో షూట్ చేసుకొని, 2024లో రిలీజ్ చేద్దామనుకున్న చిత్రమిది. ఆ సినిమా పేరు “దిల్ రూబా”.
విశ్వ కరుణ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొన్నాళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. రుక్సర్ (Rukshar Dhillon), నజియా డేవిసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో క్రాంతి కిళ్లి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. “క”తో మంచి కమర్షియల్ హిట్ కొట్టిన కిరణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సినిమా ప్రమోషన్స్ టైంలో ఒకటికి పదిసార్లు చెప్పిన విషయం తెలిసిందే.
మరి అలాంటప్పుడు వెంటనే ఈ పాత సినిమాను మళ్లీ ఎందుకు లైన్లోకి తీసుకున్నాడు అనేది అతడికే తెలియాలి. ఒకవేళ సబ్జెక్ట్ నిజంగా బాగుండి, కిరణ్ & టీమ్ కి పేరు తీసుకొచ్చేది అయితే పర్లేదు కానీ, ఏమాత్రం తేడా కొట్టినా “క”తో వచ్చిన ఇమేజ్ మేకోవర్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇకపోతే.. కిరణ్ అబ్బవరం హీరోగా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ బ్యానర్స్ అన్నీ మొగ్గు చూపుతున్నాయి.
కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కి కూడా వెనుకాడడం లేదట. మరి కిరణ్ అబ్బవరం తన అసలైన కొత్త సినిమా ఎవరి బ్యానర్ లో, ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ “దిల్ రుబా”ను కిరణ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తాడు? అనేది చూడాలి.