దాదాపు ఎనిమిది వందల మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు నిర్వహిస్తే ఓ ఐదారు వందల మంది మాత్రమే ఓటు వేస్తారని అంచనా. అలాంటిది ఈ ఎన్నికలు జరిగిన ప్రతీసారి రచ్చ జరుగుతూనే ఉంది. కొన్నేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్, జయసుధ అధ్యక్ష పదవి కోసం తలపడ్డప్పటి నుంచి ‘మా’ ఎన్నికలకు ఎక్కడాలేని ప్రాధాన్యం దక్కించుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగడం..
ఆయనకు పోటీగా మంచు విష్ణు పోటీ చేస్తుండడం.. వీరిద్దరూ కాకుండా జీవిత, సీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు కూడా అధ్యక్ష పదవిపై గురి పెట్టడంతో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎన్నికల బరిలో లేకపోయినా ఈ వ్యవహారం మరింత వేడెక్కడానికి పరోక్షంగా కారణమయ్యారు. ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం మరో వ్యక్తి కాదంబరి కిరణ్ రంగంలోకి దిగుతున్నారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శివాజీరాజా మద్దతు తనకు ఉందని.. ‘మా’ సభ్యుల్లో చాలామంది తనకు సన్నిహితులని కాదంబరి కిరణ్ అన్నారు. ‘మా’ సభ్యత్వం 800 మందికి పైగా ఉన్నప్పటికీ.. ఎన్నికల రోజు వచ్చి ఓట్లు వేసేది మాత్రం ఐదు వందల మందేనని.. అందులో 350 ఓట్లు తనకు పడతాయని ధీమాగా చెబుతున్నారు కాదంబరి కిరణ్. మరి ఆయన ఆశిస్తున్నట్లుగానే ఈ ఎన్నికల్లో గెలుస్తారేమో చూడాలి!