లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అంటేనే ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్. ఢిల్లీ, విక్రమ్, రోలెక్స్ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్లను ఒకే తాటిపైకి తెచ్చి లోకేష్ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ యూనివర్స్‌కు పునాది వేసిన ‘ఖైదీ 2’ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందనే వార్తలు ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఇంత మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టును లోకేష్ వదిలేస్తారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఈ అనుమానాలకు ప్రధాన కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేయడమే. రజనీకాంత్ ‘కూలీ’ తర్వాత ఖైదీ సీక్వెల్ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ సడన్‌గా బన్నీ ప్రాజెక్ట్ లైన్లోకి రావడంతో ‘ఖైదీ 2’ పక్కన పెట్టినట్లే అనిపిస్తోంది. అల్లు అర్జున్ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుండటంతో, అప్పటి వరకు ఢిల్లీ బాబును మనం స్క్రీన్ పై చూసే అవకాశం లేదని అర్థమవుతోంది.
ఇదే విషయంపై హీరో కార్తీని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. “ఖైదీ 2 గురించి నాకంటే లోకేష్ కే బాగా తెలుసు, ఆయనే క్లారిటీ ఇవ్వాలి” అంటూ కార్తీ తప్పించుకోవడం చూస్తుంటే, లోకేష్‌కు మేకర్స్‌కు మధ్య ఏదో గ్యాప్ వచ్చిందనే రూమర్స్ నిజమే అనిపిస్తోంది. లోకేష్‌కు, నిర్మాణ సంస్థకు మధ్య రెమ్యూనరేషన్ లేదా ఇతర విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు లోకేష్ తన డైరెక్షన్ పనుల కంటే ఇతర విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు అనౌన్స్ చేయడం, వరుసగా ఇతర హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తుండటంతో LCU భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ‘ఖైదీ 2’ పట్టాలెక్కకపోతే అది కచ్చితంగా ఆడియన్స్‌కు పెద్ద నిరాశే అవుతుంది. అసలు లోకేష్ మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒక సెన్సేషనల్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, దాన్ని మధ్యలోనే వదిలేయడం లోకేష్ లాంటి డైరెక్టర్ నుంచి ఎవరూ ఊహించని విషయం. మరి ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ లోకేష్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.
