“పేషెంట్ బ్రతుకుతాడా లేదా అనేది డాక్టర్లు (ప్రేక్షకులు) చెప్పాలి కానీ దారినపోయే దానయ్యలు (రివ్యూ రైటర్లు) కాదు అంటూ “జైలవకుశ” సక్సెస్ మీట్ లో రివ్యూల మీద రివ్యూ రైటర్ల మీద ఎన్టీఆర్ విరుచుకుపడిన సందర్భాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే.. ఆ సినిమా రిజల్ట్ ఏమైంది అనేది పక్కన పడేస్తే త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఆ ప్రశంసల గురించి పట్టించుకోకుండా సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ ను వేలెత్తి చూపినందుకు రచ్చ రచ్చ చేశాడు. ఎన్టీఆర్ అనే కాదు ఆల్మోస్ట్ ప్రతి హీరో/డైరెక్టర్/ప్రొడ్యూసర్ తమ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పుడు ఇలా రెస్పాండ్ అయ్యారు.
కానీ.. ఈ విషయంలోనే కళ్యాణ్ రామ్ మెచ్యూరిటీ చూపించాడు. “ఎంత మంచివాడవురా” సినిమాకి 1.5 రేటింగ్స్ వచ్చినా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “ఇప్పుడు నా సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని వీళ్ళని తిట్టాలా?.. సినిమాలో తప్పులు వేలెత్తి చూపించారు.. అందుకు కృతజ్ణతలు, నా తదుపరి సినిమాల్లో ఈ తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. కాకపోతే.. మరీ నెగిటివ్ గా కాకుండా సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్పి ఉంటే బాగుండేది” అని వ్యాఖ్యానించారు కళ్యాణ్ రామ్. ఈ మెచ్యూరిటీ లోపించిన కారణంగానే చాలామంది మీడియా ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బ్యాడ్ అయిపోతున్నారు. కళ్యాణ్ రామ్ లాగే మిగతా హీరోలు/డైరెక్టర్లు/ప్రొడ్యూసర్లు ఆలోచిస్తే బాగుండు.