“అమృతం” ప్రాణం పోసింది : శ్రీ కళ్యాణ్ రమణ

  • August 26, 2016 / 02:49 PM IST

అమృతం పానీయం ప్రాణం పోస్తుంది అంటుంటాం. అలాగే ఆ పేరుతో రూపుదిద్దుకున్న సీరియల్ తన జీవితానికి ఊపిరి ఇచ్చిందని గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ కళ్యాణ్ రమణ చెప్పారు. కళ్యాణ్ కొండూరి,  కళ్యాణ్ మాలిక్ గా తెలిసిన ఈయన తాజాగా సంగీతమందించిన సినిమా “జ్యో అచ్యుతానంద”. ఈ సినిమా ట్రైలర్ కి ముందు తన పేరును శ్రీ కళ్యాణ్ రమణ గా మార్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కి సొంత తమ్ముడైన ఇతను గాయకుడిగా ఎదగాలని భావించారు. మ్యూజిక్ డైరక్టర్ గా స్థిరపడ్డారు. రీసెంట్ గా అయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఏడో తరగతి మాత్రమే చదివి ఇంట్లో నుంచి పారి పోయినందుకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతుంటానని చెప్పారు.  అన్నయ్య కీరవాణి సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద పని చేసేటప్పుడు ఆ వాతావరణం పరిశీలించే అవకాశం లభించిందని వెల్లడించారు. స్వరాలూ కూర్చగల ఆత్మవిశ్వాసం తనకులేదని గాయకుడిగానే స్థిరపడుదామని అనేక ఏళ్లు స్టూడియోల చుట్టూ తిరిగానని చెప్పారు.

బాంబే లో కెమెరా మాన్ రసూల్ ఎల్లోర్ గదిలో ఉంటూ   ఆరునెలల పాటు ప్రయత్నాలు సాగించానని, అయినా ఒక్కరు కూడా పాడే అవకాశం ఇవ్వలేదని వివరించారు. తర్వాత ఇక్కడకు తిరిగి వచ్చి అన్నయ్య స్వరపరిచిన పాటల ద్వారా గాయకుడిగా తెరపైన పేరు చేసుకున్నానని తెలిపారు. ” గాయకుడిగా నిరూపించుకున్నా అవకాశాలు రాలేదు. అప్పుడు హాస్టల్ (పేయింగ్ గెస్ట్) రెంట్ 2200 ఇవ్వడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడే వాణ్ని ఆ సమయంలో నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగ రాజు అయన చేసే ఓ వాణిజ్య ప్రకటనకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇమ్మని అడిగారు. ఇచ్చాను. అతనికి బాగా నచ్చింది. అందుకు 1500 ఇచ్చారు. ఆతర్వాత మా కాంబి నేషన్లో వచ్చిన “అమృతం” నా జీవితాన్ని మార్చి వేసింది.  ఆ సీరియల్ కి మ్యూజిక్ ఇవ్వడం తో పాటు టైటిల్ సాంగ్ కూడా నేనే పాడాను. మంచి పేరు వచ్చింది.” అని శ్రీ కళ్యాణ్ రమణ గుర్తు చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus