‘లోక నాయకుడు’ కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. అంతే కాకుండా ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం విక్రమ్ సినిమాపైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్‌తో మూడు సంవత్సరాల విరామం తర్వాత కమల్ హాసన్ పెద్ద స్క్రీన్‌లపై తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
వైల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రంగా రూపొందుతున్న విక్రమ్ సినిమా OTT హక్కులు ఇటీవల భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను (అన్ని వెర్షన్లు) డిస్నీ+ హాట్‌స్టార్ మరియు శాటిలైట్ హక్కులను (అన్ని వెర్షన్‌లు) స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ హక్కులను దాదాపు 125కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక విధంగా ఇది కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ అనే ముగ్గురు జాతీయ అవార్డ్ విన్నింగ్ నటుల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందని అనిపిస్తోంది.
ఇది కమల్ యొక్క 232వ చిత్రం. అలాగే ఆయన స్వంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, నరేన్, కాళిదాస్ జయరామ్, శాన్వి శ్రీవాస్తవ మరియు మైనా నందిని కూడా నటించారు. గిరీష్ గంగాధరన్ కెమెరా క్రాంక్ చేయగా, అనిరుధ్ సంగీత దర్శకుడు. KGF సిరీస్ వంటి చిత్రాలకు పనిచేసిన అన్బు అరివు కొరియోగ్రఫీ చేసిన కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తాయట. ఇక మే 15న విక్రమ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు, జూన్ 3న అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్‌తో పోటీగా సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.