“ఆకాశం నీ హద్దురా, జై భీమ్” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి సూర్య (Suriya) విషయంలో నెలకొన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం వల్ల హీరోగా కంటే నిర్మాతగా ఎక్కువగా నష్టపోయాడు సూర్య. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు “కంగువ” (Kanguva)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నవంబర్ 14న విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ “ఏ” సర్టిఫికెట్ ఇచ్చేందుకు సిద్ధమవ్వగా, కొన్ని కట్స్ & కొన్ని సీన్స్ ను తొలగించి “యు/ఏ” సర్టిఫికెట్ అందుకోవడానికి సన్నద్ధమవుతున్నారు చిత్రబృందం.
ఈమేరకు సెన్సార్ బోర్డ్ చెప్పిన 14 మాడిఫికేషన్స్ ను చేసి మళ్లీ సెన్సార్ కు సబ్మిట్ చేయనున్నారు. సెన్సార్ బోర్డ్ పేర్కొన్న మోడిఫికేషన్స్ అన్నీ రక్తపాతానికి సంబంధించినవే. క్రీస్తుపూర్వం కథ కావడం, యుద్ధం నేపథ్యం కావడంతో “కంగువ”లో భారీ స్థాయి పోరాటాలు, రక్తపాతం ఉంటుంది. కాకపోతే.. సూర్య సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపుతారు కాబట్టి, థియేటర్లో అందరూ సినిమా చూడాలన్న ఉద్దేశ్యంతో సినిమాలోని రక్తపాతాన్ని కట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సూర్య సరసన దిశా పటాని (Disha Patani) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా సూర్యకు సూపర్ హిట్ కట్టబెడుతుందో లేదో చూడాలి. దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా అయ్యింది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఇక్కడ బెనిఫిట్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
పర్మిషన్స్ వస్తే ఉదయం 4.00 గంటల నుండే షోస్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు, మాత్రమే కాక “గోట్” తరహాలో తమిళ వెర్షన్ కి కూడా హైదరాబాద్ లో బెనిఫిట్ షోస్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నిర్మాతలు. మరి తెలుగు రాష్ట్రాల్లో సూర్యకి ఉన్న క్రేజ్ అలాంటిది.