విజయ్ సేతుపతి-నయనతార-సమంత ల క్రేజీ కాంబినేషన్ లో విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ “కన్మణి రాంబో కటీజా”. తమిళంలో “కాతువాకుల రెండు కాదల్”గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. నేడు సమంత పుట్టినరోజును పురస్కరించుకొని విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: పుట్టకతోనే దురదృష్టవంతుడిగా పేరు తెచ్చుకున్న రాంబో (విజయ్ సేతుపతి) చిన్నప్పుడే తన తల్లికి దూరంగా పారిపోతాడు. మూడు పదుల వయసు వచ్చేంతవరకూ ప్రేమ-పెళ్లి లాంటివేమీ లేకుండా ఉండిపోతాడు. సరిగ్గా అదే తరుణంలో పరిచయమవుతారు కన్మణి (నయనతార) & కటీజా (సమంత). ఇద్దరినీ సమానంగా ఇష్టపడి, ప్రేమిస్తాడు రాంబో. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెళ్లి దాకా వెళ్తుంది.
చివరికి రాంబో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? ఎవరు ఒంటరిగా మిగిలిపోయారు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: విజయ్ సేతుపతి, నయనతార, సమంతలు తమ పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ మినహా ఎవరి క్యారెక్టర్స్ కు సరైన జస్టిఫికేషన్ లేదు. అందువల్ల విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి కనెక్ట్ అయినట్లు ఫీమేల్ క్యారెక్టర్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. అయితే.. నయనతార తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంటే.. సమంత మాత్రం గ్లామర్ తో రచ్చ చేసింది. ఈమధ్యకాలంలో సమంత ఈస్థాయి గ్లామరస్ గా కనిపించిన సినిమా ఇదే. ప్రభు, రెడిన్, శ్రీశాంత్ తదితరులు నవ్వించారు.
సాంకేతికవర్గం పనితీరు: అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమాలో మ్యాటర్ లేకపోయినా తన సంగీతంతో లాక్కొచ్చాడు. సినిమాటోగ్రఫీ & ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి.
దర్శకుడు విగ్నేష్ శివన్ తాను రాసుకున్న కథ కంటే.. స్టార్ క్యాస్ట్ మీద ఎక్కువగా ఆధారపడ్డాడు. సినిమా టీజర్, ట్రైలర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను సినిమాతో క్రియేట్ చేయలేకపోయాడు. కామెడీ సినిమాలో ఎమోషన్స్ అనేవి చాలా అరుదుగా వర్కవుటవుతాయి. ఈ చిత్రంలో ఆ కాంబినేషన్ వర్కవ్వలేదు. అందువల్ల సినిమా మొత్తం ఏదో సాగుతున్నట్లుగా ఉంటుంది. మధ్యమధ్యలో కామెడీ, కొన్ని డైలాగ్స్ అలరించినా.. సినిమాగా మాత్రం బోర్ కొడుతుంది. అందుకు ముఖ్యమైన కారణం కథనం.
ఈ తరహా కథలు ఆల్రెడీ ఒక 50 దాకా చూసేశామ్. తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు బోలెడొచ్చాయి. ట్రీట్మెంట్ మొదలుకొని స్క్రీన్ ప్లే వరకూ “కన్మణి రాంబో కటీజా” కూడా అదే తరహాలో ఉండడంతో.. ప్రేక్షకులకు స్టార్ క్యాస్ట్ తప్ప సినిమా ఎక్కడా కొత్తగా కనిపించదు, అనిపించదు.
కథకుడిగా, దర్శకుడిగా ఫెయిలైన విగ్నేష్ శివన్.. లిరిక్ రైటర్ గా మాత్రం తమిళంలో ఆకట్టుకున్నాడు.
విశ్లేషణ: చాన్నాళ్ల తర్వాత సమంత క్యారెక్టర్ లో చిన్మయి వినిపించడం, అనిరుధ్ సంగీతం మినహా మరో ప్లస్ పాయింట్ లేని “కన్మణి రాంబో కటీజా”ను ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. అయితే.. చాలా పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా కావడం, నయనతార-సమంతల ఫ్యాన్ బేస్ కాస్త పెద్దది కావడంతో కమర్షియల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. అయితే.. సినిమా పరంగా “కన్మణి రాంబో కటీజా” ఆడియన్స్ ను అలరించడం కష్టమే!
రేటింగ్: 2/5