సినిమాకు కాపీ మరక.. చాలా ఏళ్ల నుండి ఈ పరిస్థితి చూస్తున్నాం. అందులోనూ స్టార్ హీరోల సినిమాలకు, హిట్ అయిన సినిమాలకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ పోలిక ఓ హిట్ సినిమాతోనే చేస్తారు. కానీ బ్లాక్‌బస్టర్ సినిమాను ఓ డిజాస్టర్ సినిమాను చూసి తీశారు అంటే ఎలా ఉంటుంది. అస్సలు బాగోదు కదా. ఇప్పుడు అదే మాట చెప్పాల్సి ఉంటుంది.. శాండిల్‌వుడ్ డైరక్టర్ ఆర్.చంద్రుకి. ఎందుకంటే తన డిజాస్టర్ సినిమా ‘కబ్జా’ను చూసే ‘ఓజీ’ సినిమా తీశారు అంటున్నారాయన.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఓజీ’. సెప్టెంబరు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రూ.300 కోట్లకుపైగా వసూళ్లు అందుకుంది కూడా. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవల ఆర్.చంద్రు చూసినట్లున్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో వైరల్ కామెంట్స్ చేశారు. తాను తెరకెక్కించిన ‘కబ్జా’ సినిమాను స్పూర్తిగా తీసుకుని ‘ఓజీ’ సినిమాను రూపొందించారనికామెంట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపేంద్ర హీరోగా రూపొందిన ‘కబ్జా’ సినిమా ఒక యావరేజ్ చిత్రం. గ్యాంగ్‌స్టర్ డ్రామాగానే రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. సుమారు రూ.90 కోట్ల నష్టాలు వచ్చాయని అప్పట్లో బాక్సాఫీసు పండితులు చెప్పారు. అంతేకాదు ‘కేజీయఫ్’ సినిమాను చూసి ఆ ఫ్లోలో ఈ సినిమా తీశారనే విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ సినిమా. అలాంటిది ఇప్పుడు ‘ఓజీ’ సినిమాను కాపీ చేశారని, ఇన్‌స్పైర్ అయ్యారని కామెంట్లు చేయడం ఏంటో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక రెండు సినిమాల కథలకు చాలా డిఫరెన్స్ ఉంది. పేరుకే గ్యాంగ్‌స్టర్ సినిమా కావొచ్చు కానీ బేస్ వేరు, టైమ్ వేరు, నేపథ్యాలు వేరు. ఇక ఎలివేషన్ సీన్స్ సంగతంటారు. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో ఒకేలా ఉంటున్నాయి లెండి. హీరోల స్క్రీన్ ప్రజెన్స్ వల్ల ఒక్కో సీన్ ఒక్కోలా మారిపోతోంది అంతే.