దర్శకుడిగా రిషబ్ శెట్టి మార్క్ ను “కాంతార” (Kantara) కంటే ముందు “కిరిక్ పార్టీ”తోనే అందరూ ఆస్వాదించారు. ఇక కాంతారతో స్టార్ యాక్టర్ & డైరెక్టర్ అయిపోయాడు రిషబ్. 2022లో విడుదలైన ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “కాంతార చాప్టర్ 1” మీద విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ట్రైలర్ కాస్త కంట్రోల్ చేసినప్పటికీ.. సినిమా మీద నమ్మకం మాత్రం అలానే ఉంది. అందులోనూ దైవాంశ చిత్రం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంతార ప్రీక్వెల్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ: “కాంతార”లో శివ (రిషబ్ శెట్టి) మాయమైన చోట నుండే “కాంతార చాప్టర్ 1” (Kantara: Chapter 1) కథ మొదలవుతుంది. అసలు పంజుర్లి వాసులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు? ఎందుకని శివుడు వాళ్ళకి అండగా నిలిచాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలతో సినిమా మొదలవుతుంది.
కట్ చేస్తే.. తెగ నాయకుడు బెర్మే (రిషబ్ శెట్టి) తమ గూడెం వాసుల జీవితాలను మార్చాలనే ధ్యేయంతో బాంగ్రా రాజ్యానికి ప్రయాణమవుతాడు. అక్కడ కులశేఖర్ (గుల్షన్ దేవయ్య), కనకవతి (రుక్మిణి వసంత్) లు పరిచయమవుతారు. వారితో మొదట్లోనే సమరానికి దిగి అక్కడ తన తెలివితో కాంతార ప్రాంతపు జెండా ఎగురవేస్తాడు బెర్మె.
అయితే.. కాంతార ప్రజలతో బాంగ్రా రాజ్యపు మహారాజు విజయేంద్ర (జయరాం) మర్యాదపూర్వకంగానే ఉన్నప్పటికీ.. లోలోపల మాత్రం రగిలిపోతుంటాడు.
ఈ చదరంగంలో దైవం మీద దుష్టశక్తులు ఏ విధంగా ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించాయి? వాటిని బెర్మె ఎలా తిప్పికొట్టాడు? ఈ క్రమంలో అతడికి దైవం ఎలా తోడ్పడింది? అనేది “కాంతార చాప్టర్ 1” కథాంశం.
నటీనటుల పనితీరు: రిషబ్ శెట్టి నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. భూతకోలా సీక్వెన్సులను మరింత అద్భుతంగా ప్రెజెంట్ చేయగలిగాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అతడి కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అతడి ఆహార్యం, వ్యవహారశైలి చాలా సహజంగా ఉన్నాయి. రిషబ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు క్లైమాక్స్ సీక్వెన్స్ లో. కచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది అతడి నటన. అయితే.. అతడి పాత్రకు డబ్బింగ్ చెప్పించిన వాయిస్ ఆర్టిస్ట్ ఇంకాస్త బేస్ వాయిస్ తో చెప్పి ఉంటే బాగుండేది. అతడి భారీ ఖాయానికి, వాయిస్ పేలవమైపోయింది.
రుక్మిణి వసంత్ ను ఇప్పటివరకు అయితే ఏడుస్తూ లేదా నవ్వుతూ చూసాం కానీ.. ఆమెను ఆకర్షణీయంగా, సొగసరిగా చూపించిన చిత్రమిదే అనే చెప్పాలి. వయ్యారం కూడా హుందాగా పలికించింది ఆమె. ఆమెలోని మరో యాంగిల్ ను కూడా చూపించాడు రిషబ్, అది ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఆ సీక్వెన్సులో ఆమె నటన ఆశ్చర్యపరచడం ఖాయం.
బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, మలయాళ నటుడు జయరాంల స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి మంచి వెల్యూ యాడ్ చేసింది.
ఇక లెక్కలేనంత మంది ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా అద్భుతమైన సినిమా ఇది. జంతువుల గ్రాఫిక్స్ సీక్వెన్సులన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా ఆ పులి సీక్వెన్స్ చాలా నేచురల్ గా ఉంది. కాకపోతే.. ఆ హల్క్ లాంటి బ్రహ్మరాక్షసుడు సీక్వెన్స్ విషయంలోనే ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని టాప్ క్లాస్. కాంతార ప్రపంచాన్ని సృష్టించిన విధానం ప్రశంసనీయం. మీడియం బడ్జెట్ లో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారని చెప్పాలి. టెక్నికల్ గా సినిమా మీద వేలెత్తే అవకాశం ఏ ఒక్క టెక్నీషియన్ ఇవ్వలేదు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కూడా బాగుంది కానీ.. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. వీటన్నిటినీ మించి యాక్షన్ కొరియోగ్రఫీ మరో స్థాయిలో ఉంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ను కానీ డిజైన్ చేసిన విధానం అదిరిపోయాయి.
ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాకి మైనస్ ఏంట్రా అంటే.. కథనం. కాంతార ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అసలు పంజుర్లి జాతి ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది అని చెప్పే విధానంలోనే చాలా తప్పులు దొర్లాయి. అలాగే.. గ్రాండ్ స్కేల్ లో చాలా సన్నివేశాలు ఉన్నప్పటికీ.. ఎందుకనో సదరు సన్నివేశాల వల్ల సినిమాకి ఉపయోగం ఏముంది అనిపిస్తుంది. రథం సీక్వెన్స్ అలాంటిదే. హీరో ఎలివేషన్ బాగున్నా.. దాని వల్ల సినిమాకి ఒరిగింది ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. అలాగే.. యుద్ధం సమయంలో ఇరికించిన అనవసరమైన కామెడీ ఇబ్బందిపెడుతుంది. దర్శకుడిగా రిషబ్ టెక్నికల్ నాలెడ్జ్ మరియు షాట్ డివిజన్ & కంపోజిషన్ విషయంలో అతడికున్న పట్టును ప్రశంసించకుండా ఉండలేం. అయితే.. ఆ పనితనం కథగా “కాంతార చాప్టర్ 1”ను ఆకట్టుకునే, ఎంగేజ్ చేసేలా తీయడంలో మాత్రం లోపించింది అనే చెప్పాలి.
కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది పక్కన పెడితే, ఎమోషన్ అనేది మిస్ అయ్యింది. ఎవరెందుకు పోరాడుతున్నారు? అనే క్లారిటీ లోపిస్తుంది. అలాగే.. “కాంతార”లో ఉన్న వావ్ ఫ్యాక్టర్, షాక్ ఎలిమెంట్ ఈ ప్రీక్వెల్ లో లోపించింది. అందుకు కారణం పాత సినిమాలో భూతకోలాను రెండేసార్లు చూపిస్తే.. ఇక్కడ ఫస్టాఫ్ లో రెండుసార్లు, సెకండాఫ్ లో మూడుసార్లు చూపిస్తారు. అందువల్ల ఇంపాక్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ లో భూతకోలాకు చిన్న ఫెమినిటీ టచ్ ఇచ్చినా.. ఎందుకనో ఆస్థాయి ఇంపాక్ట్ లేకుండాపోయింది. అలాగే.. మరీ ఎక్కువ తెగలు, ఎలిమెంట్స్ ను ఇరికించేసరికి మూలకథకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. అదే విధంగా క్యారెక్టర్స్ తోనూ జర్నీ చేయలేరు. ఓవరాల్ గా చెప్పాలంటే.. దర్శకుడిగా ఆశ్చర్యపరిచిన రిషబ్ శెట్టి, కథకుడిగా ఆకట్టుకోలేకపోయాడు.
విశ్లేషణ: డివైన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి, అత్యద్భుతమైన టెక్నికాలిటీస్ సెట్ అయ్యి. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో వీఎఫెక్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ ఆశ్చర్యపరిచిన.. “కంతార చాప్టర్ 1” ఎందుకనో “కాంతార” స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకు కారణం స్క్రీన్ ప్లేలో ఎంగేజ్మెంట్ లోపించడం, పాత్రల ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వలేకపోవడం. ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఆ భూతకోలా సీక్వెన్సులు మరియు అద్భుతంగా డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ను ఆస్వాదించగలిగితే “కాంతార చాప్టర్ 1” అలరిస్తుంది. అలాగే.. రిషన్ శెట్టి టేకింగ్, రుక్మిణి వసంత్ పెర్ఫార్మెన్స్, జయరాం స్క్రీన్ ప్రెజన్స్ కూడా ఆకట్టుకుంటాయి.
ఫోకస్ పాయింట్: సంభ్రమాశ్చర్యపరచలేకపోయిన శివ గణం!
రేటింగ్: 2.5/5