హిట్ ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడుంటారు. ఈ మాట మేం అనడం లేదు. అల్లు అరవింద్‌ను దగ్గర నుండి గమనించిన వాళ్లు ఎవరైనా ఈ మాట ఇట్టే చెప్పేస్తారు. కావాలంటే రీసెంట్గా ‘కార్తికేయ’తో హిట్ కొట్టిన చందు మొండేటియే ఒక సాక్ష్యం. ఇప్పుడు మరో హిట్ దర్శకుణ్ని పట్టేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతకీ అతనవెవరంటే ‘కాంతార’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రిషభ్ శెట్టి. కన్నడ నాట మంచి విజయం అందుకున్న ‘కాంతార’ సినిమాను కాస్త ఆలస్యమైనా భారీ రేంజిలో తెలుగులో విడుదల చేశారు అల్లు అరవింద్.
ఇక్కడ కూడా సినిమాకు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ పెంచారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రిషభ్ శెట్టి తెలుగులో సినిమా తెరకెక్కించడానికి ఓకే చెప్పినట్లు తెలిపారు. అంతకంటే ముందు ఈ సినిమా తన దగ్గరకు ఎలా వచ్చింది, ఆ సమయంలో తన ఫీలింగ్స్ ఏంటి అనే వివరాలు కూడా వెల్లడించారు అల్లు అరవింద్. కన్నడలో ఈ సినిమాను చూశారట నిర్మాత, అల్లు అరవింద్ ఆప్తుడు బన్ని వాసు.
సినిమా అయిపోయాక పరిగెత్తుకుంటూ అల్లు అరవింద్ దగ్గరకు వచ్చి… ‘అర్జెంటుగా మీరొక సినిమా చూడండి’ అని అన్నారట. ఆ సమయంలో ఏంటీ బన్ని వాసు ఇంతగా ఎగ్జైట్ అవుతున్నాడు అనుకుంటూ.. సినిమా చూశారట అల్లు అరవింద్. సినిమా చూశాక బన్ని వాసు ఎగ్జైట్మెంట్ కరెక్టే అనిపించిందట. ఆ సినిమా ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యి… తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించిందట అల్లు అరవింద్‌కి. అలా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం అని అల్లు అరవింద్ చెప్పారు.
ఆ తర్వాత తెలుగు సినిమా గురించి మాట్లాడారు అల్లు అరవింద్. ‘గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను.. ఆయన కూడా ఒప్పుకున్నారు అని అల్లు అరవింద్ చెప్పారు. అయితే ‘కాంతార’ తర్వాత ‘కిర్రాక్ పార్టీ 2’ చేస్తానని ఆ మధ్య రిషబ్ శెట్టి చెప్పారు. మరిప్పుడు ఏది ముందు అనేది ఆయనే చెప్పాలి.