సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన ‘కాంతార’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుని ఇప్పటికీ కన్నడ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో అక్టోబర్ 15 న రిలీజ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ కు భారీ లాభాలను అందిస్తుంది ‘కాంతార’ చిత్రం. తెలుగులో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సినిమా తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధించడంతో తన బ్యానర్లో ఓ చిత్రాన్ని చేయమని స్వయంగా అల్లు అరవింద్ ‘కాంతార’ హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టిని అడిగారు. ‘కాంతార’ కి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అది కాకపోయినా ‘గీతా ఆర్ట్స్’ లో కచ్చితంగా ఓ చిత్రం చేస్తాను అని రిషబ్ శెట్టి అరవింద్ గారికి మాట ఇచ్చారు. అంతలా రిషబ్ శెట్టి తన వర్క్ తో తెలుగు ప్రేక్షకులనే కాదు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను కూడా ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. ‘కాంతారా’ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.25 కోట్ల పైగా గ్రాస్ ను వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీపావళికి రిలీజ్ అయ్యే సినిమాలను కూడా ఈ మూవీ డామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా ఇంకా ఈ మూవీని చాలా మంది థియేటర్లలో చూడలేకపోతున్నారు.
మరి కొంతమందైతే ‘కాంతారా’ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అందుకు కూడా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కాంతారా’ అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవుతుందట. మొదట కన్నడ వెర్షన్ రిలీజ్ అవుతుందట. నవంబర్ 2 లేదా 3వ వారంలో మిగిలిన వెర్షన్లు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.