బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాకి దూరమయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేశారాయన. తన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నానని.. అందుకే ట్విట్టర్ కి గుడ్ బడి చెబుతున్నట్లు పోస్ట్ చేశారు. నటుడిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కరణ్ జోహార్.. ఆ తరువాత ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాతో దర్శకుడిగా మారారు. కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్షన్ ని పక్కన పెట్టి నిర్మాతగా.. రియాలిటీ షోలకు యాంకర్ గా చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో పాపులర్ షో అయిన కాఫీ విత్ కరణ్ 7వ సీజన్ ను హోస్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కరణ్ జోహార్ పై చాలా ఆరోపణలున్నాయి. ఆయన ఎక్కువగా వారసుల పిల్లలను ఎంకరేజ్ చేస్తుంటారనే అపవాదు కూడా ఉంది. సుశాంత్ సింగ్ మరణం తరువాత చాలా మంది నెటిజన్లు కరణ్ జోహార్ ను టార్గెట్ చేస్తున్నారు.
నెపోటిజం కారణంగానే సుశాంత్ ఇబ్బంది పడ్డాడని.. అతడికి అవకాశాలు రాకుండా చేశారని.. అందులో కరణ్ జోహార్ కూడా ఒకడని ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తున్నా.. ట్విట్టర్ లో బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. కరణ్ జోహార్ నిర్మించిన ‘లైగర్’ సినిమా కూడా ట్రోలింగ్ కి గురైంది. ఇందులో అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకోవడం.. బాలీవుడ్ సినిమాగా ప్రమోట్ చేయడంతో దీనిపై బాయ్ కాట్ ఎఫెక్ట్ పడింది.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కరణ్ జోహార్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు నెటిజన్లు. దానికి తగ్గట్లే సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో బాయ్ కాట్ బ్యాచ్ మరింత రెచ్చిపోయింది. కరణ్ జోహార్ ట్విట్టర్ లో ఎలాంటి పోస్ట్ పెడుతున్నా.. పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన లైఫ్ లో పాజిటివిటీ కోసం ట్విట్టర్ కి దూరమయ్యారు.