పలు సినిమాలు, సీరియల్స్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఇప్పుడు నటనతో పాటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ సంగతేమో కానీ.. తరచూ వివాదాలతో మాత్రం వార్తల్లో నిలుస్తుంటుంది. రీసెంట్ గా ఆమె కళ్యాణి శివ శక్తి ట్రస్ట్ పై ఆరోపణలు చేశారు. సదరు ట్రస్ట్ నిర్వాహకులు కోటి రూపాయలు స్వాహా చేశారని కళ్యాణి అన్నారు. అదే ప్రెస్ మీట్ లో శివశక్తి ట్రస్ట్ కి చెందినవారు తనను బెదిరిస్తున్నారని కూడా ఆమె పేర్కొన్నారు.
ఇప్పుడు ఇదే వ్యవహారంపై కరాటే కళ్యాణి తనకు ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. శివ శాకాతి ట్రస్ట్ నిర్వాహకులు చేస్తున్న తప్పుడు పనులను తాను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నానని.. దాన్ని మనసులో పెట్టుకొని కక్ష కట్టి చంపాలని చూస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ మైనర్ బాలిక హత్య కేసుకి సంబంధించిన వివరాలను కరాటే కళ్యాణి బయట పెడుతుందంటూ ఆమెపై రంగారెడ్డి కోర్టులో ప్రయివేటుగా కేసు నమోదు చేశారు.
కోర్టు ఆర్డర్ ద్వారా జగద్గిరి గుట్ట పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే తాను ఎలాంటి వివరాలను బయట పెట్టలేదని.. మైనర్ బాలిక హత్య జరిగినప్పుడు తాను సదరు అమ్మాయి తల్లిదండ్రులకు సపోర్ట్ చేశానని కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.