వరుసగా రెండు సినిమాలు ఒకే జోనర్‌లో చేయడానికి ఇష్టపడని హీరోలు ఉన్న రోజులివి. సినిమా సినిమాకు కొత్తదనం, పాత్రల్లో వైవిధ్యం చూపించాలని అనుకోవడమే దీనికి కారణం. ఈ క్రమంలో వరుసగా పాత పాత్రలనే చేసుకుంటూ వెళ్తే ఆ హీరో.. ఫ్యాన్స్‌కి బోర్ కొట్టేస్తాడా? బోర్ కొడితే ఎలా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఆ హీరోనే కార్తి (Karthi) . తమిళంలో, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న హీరో. అయితే ఇప్పుడు ఆయన లైనప్ చూస్తే.. నెంబర్స్ లేని ప్రాజెక్ట్‌లు కనిపించడం లేదు.
అలాగే ఒకే జోనర్ సినిమాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో బాగా అలవాటు, పరిచయం ఉన్న సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు ఒకప్పుడు సౌత్ సినిమాలో పెద్దగా ఉండేవి కాదు. రాజమౌళి (S. S. Rajamouli) ‘బాహుబలి’ (Baahubali) సినిమాను రెండు భాగాలు చేసిన తర్వాత ఈ పరస్థితిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు రెండు ముక్కల స్టైల్‌లోకి వచ్చేశాయి. ఆ కోవలో తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా వచ్చేసింది. దీంతో అక్కడ సీక్వెల్స్, ఫ్రాంచైజీలు వస్తున్నాయి.
అలా వస్తున్న ఫ్రాంచైజీ / సీక్వెల్స్‌లో హీరోగా కార్తినే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కార్తి ‘సర్దార్’ (Sardar) సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. ఇక కార్తి లైనప్‌లో చూస్తే ‘ఖైదీ 2’ ఉంది. ‘ఖైదీ’ (Kaithi) సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్న లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో చెప్పేశాడు. కార్తి కెరీర్లో ది బెస్ట్ అని చెప్పే ‘ఖాకీ’ (Khakee) సినిమాకు కూడా సీక్వెల్ ఉంది.
ఇక సూర్య డిజాస్టర్ సినిమా ‘కంగువ’ (Kanguva) సీక్వెల్‌లో కార్తి ఉంటాడు అని చెప్పేశారు. అయితే ఇది డౌటే. ఇక ‘హిట్ 4’లో కార్తి ఉండటం కన్ఫామ్ అయింది. ఇలా మొత్తం సీక్వెల్స్‌నో కనిపించనున్నాడు. అయితే వీటిలో ఎక్కువ పోలీసు కథలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్తిని చూసిన పాత్రలో మళ్లీ మళ్లీ చూడటం వల్ల ఆసక్తి తగ్గుతుందా? ఒకే జోనర్‌లో వరుస సినిమాలు చేయడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుందా? చూడాలి ఆయన సినిమాలు వస్తే కానీ క్లారిటీ రాదు.