సూర్య విలక్షణ నటుడన్నది సినీ జగమెరిగిన సత్యం. అతని తమ్ముడిగా తెరమీదికొచ్చిన కార్తీ ‘పరుత్తివీరన్’ (తెలుగులో మల్లిగాడు), ‘ఆయిరతి ఒరువన్’ (యుగానికి ఒక్కడు) వంటి విభిన్నమైన కథలతో కెరీర్ మొదలెట్టాడు. అయితే అవి అనుకున్న ఫలితాన్ని రాబట్టకపోయేసరికి ట్రాక్ మార్చి యూత్ ఫుల్ సినిమాలతో ప్రేక్షకులకి చేరువ కావాలనుకున్నాడు. అనుకున్నట్టే ఆవారా, నాపేరు శివ లాంటి సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షుకుల మనసుల్ని గెలుచుకున్న కార్తీ మళ్ళీ ప్రయోగాల బాట పట్టాడు.గోకుల్ దర్శకత్వంలో కార్తీ నటించిన ‘కాష్మోరా’ ఆ కోవలోనిదే. ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనపడనున్నాడు సూర్య సోదరుడు. ఇప్పటికే విడుదల చేసిన ఓ లుక్ సినిమాపై అంచనాలు ఏర్పరిచింది.
ప్రస్తుతం మణిరత్నం దర్శకుడిగా ‘కాట్రు వెళియిడై’ సినిమా చేస్తోన్న కార్తీ ఇటీవల పాత్రికేయులతో ముచ్చటిస్తూ “రైతు పాత్రలో నటించాలని ఉందన్న” తన కోరికను వెలిబుచ్చాడు. దానికి గల కారణాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఈ యువ హీరో. “వ్యవసాయ ఆధారిత మనదేశంలో క్రమంగా ఆ వ్యవసాయాన్నే వదిలేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో ఓ సినిమా చేస్తే కొంతైన రైతాంగానికి మంచి జరుగుతుందన్న కార్తీ ఇటీవల కొంతమంది యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు మరలడం చూశానని ఇది శుభపరిణామం అని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్ననుకున్నా కోలీవుడ్ కథానాయకులకు ఇలాంటి విషయాల పట్ల మక్కువ ఎక్కువేనన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం.