తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా కంటిన్యూ అవుతున్న విషయం అమరావతి. అక్కడ రాజధాని, భూములు, రైతులు… ఇవే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా చర్చలో ఉన్న అంశాలు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని ఓ సినిమా రాబోతోంది. నిజానికి ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరపలేదు. అయితే వేరే ఎక్కడో తీసిన సినిమాను ఆ ప్రాంతంలో తీసినట్లు చెప్పబోతున్నారు. ఇంతకీ ఏం సినిమా అనేగా… అదే కార్తి హీరోగా తెరకెక్కిన ‘సుల్తాన్’.
‘రెమో’తో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన బక్కియరాజ్ కణ్నన్ కార్తితో ‘సుల్తాన్’ అనే సినిమా రూపొందించాడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతుంది. పూర్తి గ్రామీణ నేపథ్య కథతో రూపొందిన చిత్రమిది. ఈ కథను తమిళంలో సేలంలో జరిగినట్లు చూపిస్తుండగా.. తెలుగులో అమరావతిలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో చూపిస్తున్నారట. దీంతో ఇప్పుడీ సినిమా కాంట్రవర్శీలవైపు వెళ్తుందా? అనే చర్చ మొదలైంది. ‘‘సుల్తాన్’లో కార్తి రోబోటిక్స్ ఇంజినీర్‌గా కనిపిస్తాడు.
ముంబయిలో ఉండే ఆయన ఓ చిన్న పల్లెటూరికి ఎందుకొస్తారు.. ఆ ఊరి కోసం ఆయన చేసిన త్యాగం ఏమిటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చారు దర్శకుడు బక్కియరాజ్. సాధారణంగా కార్తి బౌండ్ స్క్రిప్ట్ వినకుండా సినిమాపై నిర్ణయం తీసుకోరు అంటుంటారు. అయితే ‘సుల్తాన్’విషయానికొస్తే… ఇరవై నిమిషాలు కథ వినిపించగానే ఓకే చేసేశారట. అంతేకాదు ఈ సినిమాలో చాలా మంది ప్రతినాయకులు ఉంటారు. అందులో అసలు విలన్ ఎవరనేది ప్రేక్షకులకి పజిల్ అంట.