Adipurush: ‘ఆదిపురుష్‌’ ఎఫెక్ట్‌… అక్కడ మొత్తం సినిమాలన్నీ బంద్‌!

  • June 19, 2023 / 10:49 PM IST

‘ఆదిపురుష్‌’ సినిమా ఎంత వసూలు చేస్తోంది, దాని లెక్కేంటి, ఆ సినిమా రికార్డులేంటి అనే విషయాలు ఆసక్తికరమే కానీ.. ఇప్పుడు అంతకంటే ఆసక్తికరంగా ఆ సినిమా తీసుకొస్తున్న చికాకులు, వివాదాలు, పంచాయితీలు ఎక్కువవుతున్నాయి. సినిమా టీజర్‌ వచ్చినప్పుడే వివాదాలకు నాందిపడింది. ఆ తర్వాత సినిమా వాయిదా పడటంతో కాస్త సద్దుమణిగాయి. ఈ క్రమంలో సినిమాలో మార్పులు చేస్తున్నాం అని టీమ్‌ చెప్పేసరికి ఆ అంశాలన్నీ ఫిక్స్‌ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే రోజుకో వివాదం బయటకు వస్తూనే ఉంది.

తాజాగా ఈ సినిమా తీసుకొచ్చిన ఓ వివాదం వల్ల ఏకంగా కాఠ్‌మాండూలో భారతీయ సినిమాలు రిలీజ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీత.. నేపాల్‌లో పుడితే, ‘ఆదిపురుష్‌’ సినిమాలో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారనేది వారి వాదన. ఈ నేపథ్యంలో సంబంధిత సన్నివేశాన్ని మార్చాలని, దీనికిగాను చిత్ర బృందానికి మూడు రోజుల గడువు ఇస్తున్నామని నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ మేయర్‌ బలెన్‌ షా స్పష్టం చేశారు. ఒకవేళ సీన్‌ మార్చకపోతే ఖాట్మండ్‌ మెట్రోపాలిటిన్‌ సిటీలో ఏ హిందీ సినిమా రిలీజ్‌ చేయనివ్వం అని ట్వీట్‌ చేశారు.

అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ.. ‘ఆదిపురుష్‌’ సినిమాతోపాటు భారతీయ సినిమాలు అన్నింటినీ సోమవారం నుండి నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, జాతీయ ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం మా అందరి బాధ్యత. ఈ మేరకు మేం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదు. అందుకే సోమవారం నుండి ఖాట్మండ్‌ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని థియేటర్లలో సినిమాను ప్రదర్శించొద్దని ఆదేశాలు జారీ చేశాం. అయితే ఈ నిషేధం కాఠ్‌మండూ ప్రాంతానికే పరిమితమవుతుంది అని బలెన్ షా తెలిపారు.

ప్రభాస్‌ రాముడిగా, సీతగా కృతి సనన్‌ కనిపించిన ఈ సినిమాను రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించారు. జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.240 కోట్లు వసూలు చేసింది. వసూళ్లు ఇలా ఉంటే… అంతకుమించి అనేలా వివాదాలు వస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus