Katrina Kaif: ‘మల్లీశ్వరి’ మళ్లీ టాలీవుడ్‌కి వస్తుందా?

కెరీర్‌ ప్రారంభంలోనే టాలీవుడ్‌లో సినిమాలు చేసి.. వుడెన్‌ ఫేస్‌ అనే మచ్చ పడిపోయింది కట్రినా కైఫ్‌కి. వరుసగా రెండేళ్లలో రెండు సినిమాలు చేసి.. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు చూడలేదు. అయితే ఇప్పుడు అంటే 19 ఏళ్ల తర్వాత సౌత్‌ వైపు ఆమె మనసు మళ్లింది. అవును, ఆమెనే ఈ విషయం చెప్పింది. సౌత్‌లో మంచి దర్శకులు ఉన్నారని, వారితో సినిమా చేయాలని ఉందని అంటోంది. దీంతో ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ఇంతకీ కట్రినా ఏమంది, ఎందుకంది అనేది చూద్దాం.

ముందుగా చెప్పినట్లు 19 ఏళ్ల క్రితం ‘మల్లీశ్వరి’ అనే సినిమాతో కట్రినా కైఫ్‌ తెలుగు పరిశ్రమలోకి వచ్చింది. వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమాలో కట్రినా యువరాణి పాత్రలో నటించింది. ఆ పాత్రకు తగ్గట్టుగా గుంభనంగా ఉంటూ.. ఫర్వాలేదనిపించింది. అయితే ఆ ఒడ్డు, పొడుగు చూసి కొంతమంది ముచ్చటపడ్డారు కూడా. ఆ వెంటనే ‘అల్లరి పిడుగు’ అంటూ నందమూరి బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటించింది. తొలి సినిమా మంచి విజయం అందుకున్నా.. రెండో సినిమా దారుణ పరాజయాన్ని ఇచ్చింది.

ఆ సినిమా ఎఫెక్టో, బాలీవుడ్‌లో వరుస విజయాల వల్లనో తెలియదు కానీ.. కట్రినా మళ్లీ సౌత్‌వైపు చూడలేదు. 2006లో ఆమె చేసిన మలయాళం సినిమానే సౌత్‌లో ఆఖరు. అయితే ఇప్పుడు కట్రినా దక్షిణాది సినిమాలు చేయాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పింది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన కట్రినా.. సౌత్‌ సినిమాలు చేయాలని అనిపిస్తున్న సంగతి కూడా ప్రస్తావించింది.

మంచి కథ, బలమైన పాత్ర దొరికితే.. నటించడానికి భాష అనేది అసలు అడ్డమే కాదు. సౌత్‌ ఇండియన్‌ సినిమాలు చేయాలని నాకు అనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో గొప్ప దర్శకులు చాలామంది ఉన్నారు. దానికి ఓ ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. చాలా అద్భుతమైన చిత్రమిది. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు మణిరత్నం గొప్పగా తీశారు అంటూ తెగ మెచ్చేసుకుంది. మరి కట్రినా మాటలు విన్న దర్శకనిర్మాతలు నెక్స్ట్‌ సౌత్‌ సినిమా కోసం ఆమెనేమైనా సంప్రదిస్తారేమో చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus