నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన ‘కవితా చిత్రమ్’ పుస్తకావిష్కరణ,బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మట్టి మనిషి’ ఫిల్మ్ ప్రివ్యూ రామనాయుడు స్టూడియోస్ లో జరిగాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథి గా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ మరియు మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూ నటుడు, రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది.
పేరడీ గురుస్వామి తన పేరడీ, రివర్స్ పాటలు, స్టాండప్ కామెడీతో ఆహూతులను అలరించారు.
ఈ కార్యక్రమంలో చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ:
నా సాంకేతికత ఏమిటంటే సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయు ప్రక్రియ. ఇది 2004 లో పేటెంట్ చేయబడింది. ఇది తెలుసుకుని 2006 లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ అనధికార పర్యటనపై వచ్చి నన్ను కలిసి మాట్లాడిన తరువాత మానవాళికోసం చాలామంచిపని చేశారని అభినందించారు. ఒక రైతు గా నేను చేసినవే పేటెంట్ కోసం వ్రాసాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతధంగా ఆమోదించారు. దీని గురించి మన ప్రధాని మోడీ గారు కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది.’ అన్నారు
నటుడు, రచయిత హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ:
పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గారు ఒక శాస్త్రజ్ఞుడని ఆయన విజయం చిన్న విజయం కాదని, నిరుత్సాహపడుతున్న రైతులకు స్పూర్తి అంటూ ఒక అద్బుతమైన వ్యక్తి ని ఈ రోజు కలిశాను. ఆయన స్పూర్తి తో తీసిన ‘మట్టిమనిషి’ డెమో ఫిల్మ్ బాగుంది, ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను. మట్టిమనిషి లో ప్రధానపాత్రలో బాసంగి సురేష్ బాగా చేసారు, ఇది అతనికి ఒక మంచి ప్రమోషనల్ ఫిల్మ్ గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అన్నారు.
షేడ్స్ స్టూడియో సి.ఇ.ఓ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ:
బాసంగి సురేష్ గారికి సినిమా రంగం పై చాలా మక్కువ, ప్రభుత్వ ఉద్యోగం నుండి స్వచ్చంద విరమణ తీసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఓపిక పట్టుదలతో శ్రమిస్తూ మాలాంటి వాళ్ళకు స్పూర్తి కలిగిస్తున్నారన్నారు.
బాసంగి సురేష్ మాట్లాడుతూ:
ముఖ్య అతిథి హర్షవర్ధన్ గారికి, మట్టిమనిషి తీయటానికి స్పూర్తినిచ్చి, కార్యక్రమానికి హాజరైన పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి గారికి కథా చిత్రమ్ పుస్తక రూపకల్పనలో సహకరించిన చిత్రకారుడు తుంబలి శివాజీ గారికి, మట్టి మనిషి డెమో ఫిల్మ్ మేకింగ్ లో సహకారం అందించిన షేడ్స్ స్టూడియో అధినేత దేవీప్రసాద్ బలివాడ గారికి కృతజ్ఞతలు తెలిపారు.