కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత సినిమా చూసే వాళ్ల పరిస్థితులు మారిపోయాయి. మూసధోరణి సినిమాలను జనాలు పెద్దగా ఆదరించడం లేదు అని చెప్పాలి. దీంతో సినిమా పాయింట్‌ల అయినా, చెప్పే విధానంలో అయినా కొత్తదనం కోసం చూస్తున్నారు. తాజాగా ఇలాంటి కాన్సెప్ట్‌లో ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ ఓ సినిమా మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘కీడా కోలా’ అంటూ వస్తున్నారు.
చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. సినిమా గురించి అభిమానుల ఎదురు చూపులకు తెరదిస్తూ ‘కీడా కోలా’ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేశారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తర్వాత ఇప్పుడు అంటే అయిదేళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ మూడో సినిమా చేశారు. ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కంటెంట్ అంత కొత్తగా ఉంటుంది అని నమ్మకం కాబట్టి.
చైతన్య, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, జీవన్, తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేయనున్నారు. ఇక వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలోకి రానా దగ్గుబాటి వచ్చి చేరారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఆలోచనల మీద నమ్మకంతో ఆయన ముందుకొచ్చారని టాక్.
దర్శకత్వానికి తరుణ్ భాస్కర్ గ్యాప్ ఇచ్చినా… సినిమాలకు మాత్రం దూరంగా లేరు. ఈ గ్యాప్‌లో ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఒకే ఒక జీవితం’, ‘ఓరి దేవుడా’ సినిమాలకు డైలాగ్స్ రాశారు. అవి కాకుండా కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు కూడా. అలాగే వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేశారు. అలా ప్రేక్షకులకు దూరం కాకుండా ఉన్నారు. ఇప్పుడు ‘కీడా కోలా’లో (Keedaa Cola) యాక్ట్ చేశారు.