ప్రకృతి విలయ తాండవానికి కేరళవాసులు విలవిలలాడుతున్నారు. గత వారం రోజులుగా వర్షపు నీటిలో నానుతున్నారు. భాషా భేదం లేకుండా.. ప్రాంతీయ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ తారలు ఆర్ధిక సాయాన్ని అందించారు. అలాగే కేరళలో పుట్టి పెరిగి.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ తమవారి కోసం కష్టపడుతోంది. సినిమా షూటింగ్ లను పక్కన పెట్టి.. రోడ్డుపైకి వచ్చి మీడియాకి, సాయం చేసేవారికి, వరద బాధితులకు మధ్య వారధిగా నిలిచింది.
అంతేకాదు తనవంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 10 లక్షలు, ట్రాన్స్‌పోర్ట్, బట్టలు, నిత్యావసర వస్తువులు, మందుల కోసం మరో 5 లక్షలు విరాళంగా ప్రకటించింది. అంతటితో ఆగిపోకుండా త్రివేండ్రంలోని ఓ కళాశాల నుంచి కీర్తీ బాధితులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకుంటుంది. బాధితులకు ఏయే వస్తువులు కావాలో లైవ్ వీడియోల ద్వారా అభిమానుల్ని కోరుతుంది. దీంతో కీర్తీ చేస్తున్న ఈ గొప్ప పనుల్ని, ఆమె గొప్ప మనస్సును అభిమానులు, నెటిజనులు అభినందిస్తున్నారు. కీర్తికి అందమైన రూపమే కాదు.. అంతకన్నా మంచి మనసు ఉందని కీర్తిస్తున్నారు.