పెళ్లి అయితే హీరోయిన్ల క్రేజ్ తగ్గుతుందనేది పాత మాట. కీర్తి సురేష్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. ‘రివాల్వర్ రీటా’తో హడావిడి చేస్తున్న ఈ భామ, ఇప్పుడు కేవలం నటిగానే కాకుండా మరో కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు స్క్రీన్ మీద మాత్రమే కనిపించిన కీర్తి, త్వరలో స్క్రీన్ వెనుక కూడా చక్రం తిప్పబోతోందట.
KEERTHY SURESH
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది కీర్తి. తనకు దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉందట. ఇప్పటికే సొంతంగా ఒక స్క్రిప్ట్ రాసుకునే పనిలో పడిందట. బాలీవుడ్‌లో కంగనా రనౌత్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్స్ నటిస్తూనే డైరెక్షన్ ఎలా చేస్తున్నారో, తను కూడా అదే బాటలో నడవాలని ఫిక్స్ అయ్యింది. అంటే ఫ్యూచర్‌లో మనం కీర్తి పేరును డైరెక్టర్ కార్డ్ మీద చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అప్పుడెప్పుడో ‘మహానటి’ సినిమాలో సావిత్రిగారి పాత్రలో జీవించేసిన కీర్తి, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నట్లు అనిపిస్తోంది. సావిత్రి గారు కూడా నటిగా ఉంటూనే మెగాఫోన్ పట్టారు. కానీ ఆ రూట్ ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు కీర్తి కూడా ఆ దిశగా అడుగులు వేయడం కాస్త రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి. నయనతార లాగా మరో పదేళ్లు బిజీగా ఉంటుందని అనుకుంటే మళ్లీ డైరెక్షన్ ఏమిటి అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఒక క్రియేటర్‌గా తనను తాను నిరూపించుకోవాలనే కసి ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదని, కనీసం గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ కూడా లేదని తేల్చి చెప్పేసింది. తన ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని కీర్తి ఎంత క్లియర్‌గా బ్యాలెన్స్ చేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భర్త సపోర్ట్ ఉన్నప్పటికీ, సినిమా విషయంలో మాత్రం తన రూట్ సెపరేట్ అని క్లారిటీ ఇచ్చేసింది.