తెలుగు సినిమా నిర్మాతలకి డిజిటల్ రైట్స్ తో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా ఓ వరంలా మారిన సంగతి తెలిసిందే. ఇది వరకు తెలుగు సినిమాని పెద్దగా నార్త్ జనాలు పట్టించుకునేవారు కాదు కానీ.. ‘బాహుబలి’ తర్వాత వాళ్ళు ఎక్కువగా తెలుగు సినిమాలను వీక్షించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే డబ్బింగ్ రైట్స్ ను కూడా కోట్లు పెట్టి.. హిందీ ఛానెల్స్ వారు కొనుగోలు చేస్తున్నారు. ఇక డబ్ చేసిన తెలుగు చిత్రాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండగా వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.
తెలుగులో ప్లాప్ అయిన సినిమాలకు కూడా అక్కడ విశేషదారణ దక్కుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ మూవీ కూడా చేరింది. ‘గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్’ వారు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ను తమ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా… 3 రోజుల్లోనే ఏకంగా 3.2 కోట్ల వ్యూస్ ను నమోదు చేసింది. అంతేకాదు 7.9 లక్షల లైకులు, 22 వేల కామెంట్స్ కూడా నమోదయ్యాయి.
గతేడాది ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయినప్పటికీ మంచి వ్యూయర్ షిప్ నమోదయ్యింది లెండి. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ కొనేరు నిర్మించారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.