సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ ప్రభాస్ అనేక సార్లు హీరో అనిపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా సాయం చేస్తుంటారు. రీసెంట్ గా వరదలకు కేరళవాసులు సర్వం కోల్పోతే తెలుగు చిత్ర పరిశ్రమ వెంటనే స్పందించింది. తమ స్థాయి మేరకు మన హీరోలు సాయం అందించారు. ప్రభాస్ అయితే వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయలు ఇచ్చారు. దీనిపై అక్కడి మంత్రి స్పందించారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కేరళ పర్యాటక శాఖ మంత్రి సురేంద్రన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ… “కేరళ రాష్ట్రంలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు.
వారు ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటారని విన్నాను. వీరందరూ తెలుగు హీరో ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. అతను ఇప్పటివరకు ఒక్క మలయాళ సినిమా కూడా చేయలేదు. అయినా కేరళ కోసం ఏకంగా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు. వరదల గురించి తెలిసిన వెంటనే సహాయం చేయడానికి ప్రభాస్ ముందుకు వచ్చారు” అని సురేంద్రన్ మలయాళ స్టార్ హీరోలను విమర్శిస్తూ.. ప్రభాస్ ని అభినందించారు. ఈ విషయం ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. మలయాళ స్టార్ హీరోలు మరింత విరాళం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.