విభిన్న చిత్రాల కథానాయకుడు కార్తీ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “ఖైదీ”. కేవలం 36 రాత్రుల్లో ముగిసిన ఈ చిత్రం షూటింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. “మహానగరం” ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ లేకపోవడం, సినిమా కథ మొత్తం ఒక రాత్రిలో ముగియడం, నిడివి కేవలం 146 నిమిషాల నిడివి సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్స్. మరి ఈ డిఫరెంట్ జోనర్ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!
కథ: ఖైదీ/దిల్లీ (కార్తీ) జీవిత ఖైదును అనుభవిస్తుంటాడు. సత్ప్రవర్తన కారణంగా తన కూతుర్ని చూడడం కోసం పెరోల్ మీద విడుదల చేయబడతాడు. తన కూతుర్ని కలవడం కోసం బయలుదేరిన దిల్లీ మధ్యలో ఒక పోలీస్ & డ్రగ్ మాఫియా గొడవలో ఇరుక్కొంటాడు. మొదట తనకి ఎందుకులే.. ముందు తన కూతుర్ని పదేళ్ల తర్వాత చూడడం ముఖ్యం అనుకొంటాడు కానీ.. పోలీసోడి ఇంట్లో కూడా ఒక కుటుంబం, అతనికి కూడా ఒక కూతురు ఉంటుంది కదా అనే భావనతో.. పోలీసు ఆఫీసర్ ను కాపాడాలని రంగంలోకి దిగుతాడు. దాదాపు 30 మంది గుండాల నుండి దిల్లీ ఒక్కడే పోలీస్ ఆఫీసర్ ప్రాణాలతోపాటు.. ఆ గుండాల బారి నుండి కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ ను కాపాడి.. చివరికి తన కూతురి దగ్గరకి చేరాడా లేదా? అనేది “ఖైదీ” కథాంశం.
నటీనటుల పనితీరు: సాధారణంగా సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడం కోసం విలన్స్ ను చాలా దారుణంగా ప్రాజెక్ట్ చేస్తారు. ఒక్కోసారి హీరోయిన్స్ ను కూడా మరీ ఎబ్బెట్టైనా క్యారెక్టరైజేషన్స్ తో లేక హాస్యాన్ని పంచుతుంటారు మన ఫిలిం మేకర్స్. విలన్ పాత్రలకు కూడా ఒక గౌరవం ఇచ్చిన మొట్టమొదటి సినిమా “ఖైదీ” అని చెప్పొచ్చు. ఒక పక్క హీరో విజయం సాధించాలి అని తాపత్రయపడుతూనే.. విలన్ల విషయంలోనూ బాధపడతాం. నాకు తెలిసి “ఎవెంజర్స్” సినిమాలో తానొస్ పాత్రకు మాత్రమే నేను అలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఒక ప్రతినాయక పాత్రకి కడుఆ గౌరవం తీసుకొచ్చిన చిత్రం ఖైదీ. ప్రతినాయక పాత్రలు మాత్రమే కాదు.. సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఏ ఒక్క సన్నివేశం గురించి చెప్పినా సినిమా చూసే ఫీల్ ను పోగొట్టినవాడిని అవుతానని చెప్పడం లేదు కానీ.. ప్రతి సన్నివేశం గురించి, క్యారెక్టర్ బిహేవియర్ గురించి రాయాలని ఉంది.
కార్తీ కెరీర్ లో చాలా మంచి సినిమాలున్నాయి కానీ.. నటుడిగా కార్తీ ఫుల్ పొటెన్షియల్ ను వాడుకున్న సినిమాలు “పరుత్తివీరన్” (తెలుగులో “మల్లిగాడు”, నా పేరు శివ, మద్రాస్, ఖాకీ. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరే చిత్రం “ఖైదీ”. ఒక పదేళ్ళపాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తి మాట్లాడే విధానం, మ్యానరిజమ్స్ ఇలానే ఉంటాయేమో అనిపిస్తుంది. దర్శకుడు లోకేష్ నటుడిగా కార్తీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకొన్నాడు. ఎమోషనల్ సీన్స్ & యాక్షన్ బ్లాక్స్ లో కార్తీ నటన, హావభావాలు ప్రేక్షకుడి చూపును వెండితెర మీద నుండి పక్కకు తప్పుకోకుండా చేశాయి. చాలా తక్కువ సినిమాలకు మాత్రమే మనకి ఫోన్ చెక్ చేయకూడదు అనిపిస్తుంది. అలాంటి సినిమా “ఖైదీ”.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ కెరీర్ బెస్ట్ బీజీయం వర్క్ ఈ చిత్రం. యాక్షన్ సీన్స్ అసలే చాలా సహజంగా ఉన్నాయంటే.. దానికి సామ్ బీజీయం ఇంకాస్త ఎలివేషన్ ను యాడ్ చేసి.. ఆడియన్ కూడా థియేటర్ లో “కార్తీ వెనకాల వాడు వస్తున్నాడు చూడు” అని అరిచేలా చేస్తుంది. ఇందుకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ మరో ముఖ్యకారణం. కేవలం లారీ & కొన్ని కార్ లైట్స్ వెలుతురులో ఇసుక క్వారీలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ లు రోమాలు నిక్కబొడుచుకొనేలా చిత్రీకరించాడు సత్యన్. ఆ చీకట్లో లైట్ల కాంతిలో ఇసుక రేణువును నిప్పు రవ్వలా ప్రాజెక్ట్ చేసిన విధానం కానీ.. ఆ ఎలివేషన్ కానీ.. అభినందనీయం. ప్రొడక్షన్ వేల్యూస్ అదిరిపోయాయి. ఒక సినిమాకి ఎంత ఖర్చు చేయాలో అంతే చేశారు.
దర్శకుడు లోకేష్ మొదటి చిత్రం “మహానగరం”తోనే తన ప్రతిభను నిరూపించుకొన్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు, సమీక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ.. “ఖైదీ”తో మాత్రం యూనివర్సల్ అప్పీల్ ను అందుకోగలిగారు. హీరోయిన్, పాటలు లేకుండా కూడా కమర్షియల్ సినిమా తీయొచ్చని ప్రూవ్ చేసాడు. ప్రతి చిన్న పాత్రనూ కథనంలో వాడుకోవడం అనేది అతడు చేసిన గొప్ప పని. ఒక 120 నిమిషాల నాన్ స్టాప్ హాలీవుడ్ యాక్షన్ ఫిలింను చూస్తున్న అనుభూతి కలుగుతుంది “ఖైదీ” చూస్తున్నంతసేపు. ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ ను మరింత ఆశ్చర్యచకితుల్ని చేస్తే.. క్లైమాక్స్ మంచి సీక్వెల్ కి స్కోప్ ఇచ్చింది. ఫిలిం మేకింగ్ ప్రొసీజర్ అనేది మారింది, మారుతుంది, మారాల్సిన అవసరం ఉంది అని తెలియజెప్పే సినిమా “ఖైదీ”. రెగ్యులర్ కమర్షియల్ సినిమాతోపాటు.. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రావాలి. లేదంటే.. అదే రొడ్డకొట్టుడు మూసలో ఉండిపోతాం. భవిష్యత్ లో తెలుగులోనూ ఈ తరహా సినిమాలు వస్తే బాగుండు.
విశ్లేషణ: యాక్షన్ మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా “ఖైదీ”. హాలీవుడ్ లో ఒక థీమ్ ఫార్మాట్ లో వచ్చే “డైహార్డ్” లాంటి సినిమాలు చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఇది ఒక సమాధానం. కార్తీ కెరీర్ బెస్ట్ వర్క్ & అద్భుతమైన సినిమాటిక్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం “ఖైదీ”ని రెండుసార్లు చూసినా తప్పులేదు.
రేటింగ్: 3.5/5