King Of Kotha Review in Telugu: కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 24, 2023 / 01:33 PM IST

Cast & Crew

  • దుల్కర్ సల్మాన్ (Hero)
  • ఐశ్వర్య లేక్ష్మి (Heroine)
  • డ్యాన్సింగ్ రోజ్ షబ్బీర్, ప్రసన్న, నైల ఉషా, గోకుల్ సురేష్ తదితరులు.. (Cast)
  • అభిలాష్ జోషి (Director)
  • దుల్కర్ సల్మాన్ - జీ స్టూడియోస్ (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • నిమిష్ రవి (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 24, 2023

“సీతారామం, చుప్” చిత్రాలతో తెలుగు, హిందీ భాషల్లో మంచి విజయాలు సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ తన మాతృభాష మలయాళంలోనూ హిట్ కొట్టాలనే ధ్యేయంతో స్వయంగా నిర్మిస్తూ నటించిన సినిమా “కింగ్ ఆఫ్ కొత్త”. పాన్ ఇండియన్ సినిమాగా మలయాళంతోపాటుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదలవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. దుల్కర్ సల్మాన్ డాన్ గా నటించిన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: 1980లో కేరళలోని కొత్త అనే ఊర్లో జరిగే కథ ఇది. చాలా చిన్న స్థాయి నుంచి అండర్ వరల్డ్ డాన్ రేంజ్ కి ఎదుగుతాడు రాజు (దుల్కర్ సల్మాన్). ఎన్నో గ్యాంగులను మట్టి కరిపించి కింగ్ పిన్ లా మారిన రాజు అంటే అందరికీ కోపమే. ముఖ్యంగా పోలీసులకు, లోకల్ పోలిటికల్ లీడర్లకు రాజు మీద విపరీతమైన పగ. ఎలాగైనా రాజును తుదముట్టించాలని ప్రయత్నిస్తుంటారు.

ఈ గ్యాంగుల దుర్మార్గపు చేష్టల నుంచి రాజు ఎలా తప్పించుకొన్నాడు? పోలీసులు మరియు పొలిటీషియన్ల వల నుండి ఎలా బయటపడ్డాడు? చివరికి రాజు ప్రయాణం ఎక్కడికి చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “కింగ్ ఆఫ్ కొత్త” చిత్రం.

నటీనటుల పనితీరు: నటుడిగా ఇప్పటికే పలుమార్లు తన సత్తాను ఘనంగా చాటుకున్న దుల్కర్ సల్మాన్ కు ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా కురూప్ లాంటి సినిమా తర్వాత ఇంచుమించుగా అదే తరహాలో ఉన్న పాత్రలో దుల్కర్ జీవించేశాడు. ముఖ్యంగా 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటుంది. ఇక డాన్ తరహాలో అతడి హావభావాలు, మ్యానరిజమ్స్ అలరిస్తాయి. దుల్కర్ తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటుడు “సార్పట్ట” చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్ గా విశేషమైన రీతిలో అలరించిన షబ్బీర్. ఈ చిత్రంలో అతడికి మంచి పాత్ర లభించింది. ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు.

ఐశ్వర్య లేక్ష్మి నటన కంటే ఆమె పాత్రలను ఎంచుకునే తీరు అబ్బురపరుస్తుంది. అయితే.. నటిగా ఇంకాస్త లోతుగా పాత్రను అర్ధం చేసుకొని.. పాత్రను బలోపేతం చేసే నటన కనబరిస్తే ఆమెకు ఇంకాస్త మంచి పేరొస్తుంది. ఇప్పుడు కూడా నటిస్తుంది కానీ.. కళ్ళల్లో ఆ సిన్సియారిటీ కనిపించదు. కెమెరామెన్ తెలివిగా స్లోమోషన్ షాట్స్ లో ఆమెను కవర్ చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు కానీ.. ఆమె దొరికిపోయింది.

పోలీస్ ఆఫీసర్ గా ప్రసన్న చాలా రెగ్యులర్ గా కనిపించాడు. తల్లి పాత్రలో నైల ఉష పర్వాలేదనిపించుకుంది. గోకుల్ సురేష్, శాంతి కృష్ణ, అనిఖా సురేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. స్పెషల్ సాంగ్ లో రితికా సింగ్ స్టెప్పులు, అందాలు అడవి కాచిన వెన్నెలయ్యాయి.
విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ గెస్ట్ అపీరియన్స్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అతడి లుక్స్ కూడా బాగున్నాయి. కాకపోతే.. ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ నిమిష్ రవి సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి. చాలా సాదాసీదా కథను తన కెమెరా పనితనంతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా.. స్లోమోషన్ షాట్స్ & క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. కేవలం కెమెరా వర్క్ కోసమే సినిమాను మరోసారి చూడొచ్చు.

జేక్స్ బిజోయ్ పాటలు తెలుగులో పెద్దగా వర్కవుటవ్వలేదు. నేపధ్య సంగీతం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్ షాట్స్ కి లౌడ్ మ్యూజిక్ తో కాకుండా రితమిక్ టచ్ తో ఇచ్చిన ట్యూన్స్ కొత్తగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. 1980 నాటి స్థితిగతులను రీక్రియేట్ చేయడంలో బృందం 100% విజయం సాధించారు. దర్శకుడు అభిలాష్ ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ సినిమాను కొత్తగా, టెక్నికల్లీ స్ట్రాంగ్ గా చెప్పాలనుకున్నాడు.

టెక్నికాలిటీస్ వరకూ సక్సెస్ అయ్యాడు కానీ.. కథకుడిగా మాత్రం తడబడ్డాడు. పాత్రలు మరీ ఎక్కువైపోవడం, కొన్ని పాత్రలకు ప్రారంభంలో ఉన్న రేంజ్.. సెకండాఫ్ కి వచ్చేసరికి లేకపోవడం, అలాగే.. క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి పెద్దగా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ప్రేక్షకులు చాలా సునాయాసంగా ఊహించేయదగ్గ ట్విస్టులతో థ్రిల్లర్ ను రాసుకోవడం పెద్ద మైనస్ గా మారింది. ఓవరాల్ గా అభిలాష్ దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: దుల్కర్ నటన, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ వర్క్, జేక్స్ బిజోయ్ బీజీయమ్, ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. పాత్రలను పరిచయం చేసి, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం, ట్విస్టులు పెద్దగా వర్కవుటవ్వకపోవడంతో.. “కింగ్ ఆఫ్ కొత్త” యావరేజ్ సినిమాగా (King Of Kotha) మిగిలిపోయింది. ఈ తరహా ప్రెడిక్టబుల్ సినిమాతో, ముఖ్యంగా 4 నిమిషాల తక్కువ 3 గంటల నిడివితో జనాలని ఆకట్టుకోవడం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus