మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘విజేత’ ‘సూపర్ మచ్చి’ అనే చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు అతనికి మంచి ఫలితాన్ని అందించలేకపోయాయి. దీంతో అతను ఎంతో మనసుపెట్టి ‘కిన్నెరసాని’ అనే చిత్రం చేశాడు. ‘అశ్వద్ధామ’ తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న రమణ తేజ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్లు బాగానే అనిపించాయి.నిజానికి జనవరి 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వలన దీనిని ఓటీటీకి ఇచ్చారు మేకర్స్. జూన్ 10న అంటే ఈరోజు నుండీ జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : వెంకట్ (కళ్యాణ్ దేవ్) ఒక లాయర్. అతను చాలా తెలివైనవాడు. టాలెంట్ కలిగిన వ్యక్తి.వెంకట్ కు లిల్లీ(కాశీష్ ఖాన్) అనే లవర్ ఉంటుంది. ఆమె హత్యకు గురవుతుంది. మరోపక్క వేద (అన్ షీతల్) అనే అమ్మాయి లైబ్రరీ నడుపుతూ ఉంటుంది. ఈమెకు తన తండ్రి గురించి అన్వేషిస్తూ ఉంటుంది.ఈ క్రమంలో వెంకట్ కూడా వేదకి సాయం చేస్తుంటాడు.
ఇంతలో… వేదను చంపాలని విలన్ జయదేవ్ (రవీంద్ర విజయ్) తిరుగుతూ ఉంటాడు. అసలు జయదేవ్ ఎవరు? వేదకి అతనికి సంబంధం ఏంటి? వెంకట్ కథేంటి? మధ్యలో ‘కిన్నెరసాని’ అనే పుస్తకం కథేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘కిన్నెరసాని’ చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : కళ్యాణ్ దేవ్ మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. ‘కిన్నెరసాని’ లో అతను హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇంకా మెరుగవ్వాలి… కానీ ఈ మూవీ వరకు అతను బాగానే నటించాడు.కాశీష్ ఖాన్ పాత్ర నిడివి తక్కువే… కానీ ఉన్నంతలో ఆమె లుక్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ అన్ షీతల్‌కు ప్రాముఖ్యమైన పాత్ర దక్కింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె ఇంకా బాగా నటించాల్సి ఉంది.
అయితే ఈమె లుక్స్ కూడా బాగున్నాయి.విలన్ గా చేసిన రవీంద్ర విజయ్ అందరి కంటే ఎక్కువ మార్కులు వేయించుకుంటాడు. జయదేవ్ పాత్రకు ఇతను కరెక్ట్ గా సెట్ అయ్యారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు రమణ తేజ ‘అశ్వద్ధామ’ చిత్రం కంటే కూడా ఈ చిత్రానికి మంచి ఎఫర్ట్ పెట్టాడు అనిపించింది. ప్రతి 10 నిమిషాలకు ఓ థ్రిల్ ను ఇచ్చి ఆడియన్స్ ను ఎంగేజ్ చేశాడు.కానీ కొత్తగా ఫీలయ్యేలా ఏమీ అనిపించదు. సాయి తేజ దేశ రాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా అనిపిస్తాయి, కథనం ప్రేక్షకుడిని చివరిదాకా పాస్ బటన్ ప్రెస్ చేయకుండా చేస్తుంది.
రచయిత సాయి తేజ కి ఈ విషయంలో మంచి మార్కులు పడతాయి.మహతి స్వర సాగర్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది.థీమ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు.దినేష్ కె. బాబు సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి కావాల్సిన మూడ్ ను తన సినిమాటోగ్రఫీ తో కలిగించాడు దినేష్.
విశ్లేషణ : థియేటర్లలో కనుక రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ‘కిన్నెరసాని’ రూపంలో హీరో కళ్యాణ్ దేవ్ కు ఓ డీసెంట్ హిట్ దక్కేది. ఇప్పుడు ఓటీటీలో ఉన్నా మంచి ఫలితాన్నే అందుకునే అవకాశం ఉంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది. మిగతా వాళ్ళకి అంతగా రుచించక పోవచ్చు. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి.. వీకెండ్ కు ఓసారి హ్యాపీ గా ట్రై చేయొచ్చు.