‘క’ (KA) సినిమాతో ఎవరూ ఊహించని విధంగా విజయం అందుకుని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆ తర్వాత ‘దిల్‌రుబా’ (Dilruba) అంటూ ఓ పాత సినిమాను ముందుకు తీసుకొచ్చి మళ్లీ ఫ్లాప్ అందుకున్నాడు. ఇది పాత సినిమా కాబట్టి లెక్కలోకి తీసుకోకూడదు అనుకుంటే కిరణ్ (Kiran Abbavaram) ఇంకా హిట్ ట్రాక్‌లోనే ఉన్నట్లు. అయితే తనకు విజయం అందించిన జోనర్‌లో కాకుండా వేరే జోనర్‌లో కొత్త సినిమాను ఓకే చేశాడు అని సమాచారం. అదే ప్రేమకథ.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా మాస్ మూవీ మేకర్స్ అనే సంస్థ ఓ సినిమాను నిర్మించబోతుంది. అమృత ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి. ఈ రెండు బ్యానర్లూ కొత్తవేమీ కాదు. గతంలో ‘బేబీ’ అనే ‘కల్ట్ + క్లాసిక్’ సినిమాను అందించాయి. ఆ టైటిల్ బాగా క్యాచీగా ఉండి జనాల్లోకి వెళ్లింది కూడా. సినిమా విజయానికి అది కూడా ఓ కారణం. ఇప్పుడు వాళ్లు కిరణ్ అబ్బవరం సినిమాకు మరో క్యాచీ టైటిల్ ఖరారు చేశారట.
వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే పేరు ఫిక్స్ చేశారట. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక వీడియో షూట్ చేశారట. త్వరలోనే ఆ వీడియోతో అనౌన్స్‌మెంట్ ఘనంగా చేసే ఆలోచనలో ఉన్నారట. అప్పుడే సినిమా పేరును ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అయితే డౌటల్లా హిట్ జోనర్‌ను కిరణ్ ఎందుకు వదిలేస్తున్నట్లు.
పైన చెప్పినట్లు ‘క’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. అలాంటి జోనర్‌లో వెంటనే ఎందుకు అనేమో కిరణ్ లైన్ మార్చాడు. మరి ప్రేమకథ కలిసొస్తుందా అనేది చూడాలి. చెన్నై లవ్ స్టోరీ ఓకే కానీ.. ఈ బెంగళూరు కుర్రాడు ఏంటా అనేది మీ డౌట్ అయితే. సినిమాల్లోకి వచ్చే ముందు మనోడు అక్కడే ఉద్యోగం చేశాడులెండి.