Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ లాల్ (Hero)
  • శోభన (Heroine)
  • ప్రకాష్ వర్మ,బిను పప్పు,థామస్ మాథ్యూ,ఫర్హాన్ ఫాసిల్,మణియన్‌పిల్ల రాజు (Cast)
  • తరుణ్ మూర్తి (Director)
  • ఎం. రెంజిత్ (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • షాజీ కుమార్ (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 25, 2025

మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తాజా క్రైమ్ థ్రిల్లర్ “తుడరుమ్” (Thudarum). నిన్న (ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని కనీసం పేరు కూడా మార్చకుండా ఇవాళ (ఏప్రిల్ 26) తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. “తుడరుమ్” అంటే “సశేషం” అని అర్థం. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు కనీసం దానికి తెలుగు టైటిల్ పెట్టడంలో ఎందుకింత నిరుత్సాహం అనేది అర్థం కాని విషయం. మోహన్ లాల్, శోభన చాలారోజుల తర్వాత కలిసి నటించిన ఈ చిత్రానికి మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తెలుగు ఆడియన్స్ ను ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!

Thudarum Review

కథ: ఎన్నో ఏళ్లపాటు తమిళ సినిమాల్లో యాక్షన్ డూప్ గా చేసిన బెంజ్ అలియాస్ షణ్ముగం (మోహన్ లాల్), ఓ యాక్సిడెంట్ అనంతరం తన మాస్టర్ కొనిచ్చిన కార్ తో కేరళలో సెటిల్ అవుతాడు. బ్లాక్ అంబాసిడర్ కారు, ప్రాణంగా చూసుకునే భార్య, కుమారుడు, కూతురుతో చాలా సరదాగా జీవిస్తుంటాడు.

ఓసారి అనుకోని విధంగా తాను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్ కారును గంజాయి కేసులో పోలీసులు జప్తు చేస్తారు. ఆ కారును ఇంటికి తెచ్చుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటాడు బెంజ్. సరిగ్గా అదే సమయంలో అతని కొడుకు కూడా కనిపించకుండాపోతాడు.

బెంజ్ కొడుక్కి ఏమైంది? పోలీసులతో డీల్ చేసేప్పుడు బెంజ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? కొడుకు మిస్ అవ్వడానికి, కార్ సీజ్ అవ్వడానికి మధ్య సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “తుడరుమ్” చిత్రం.

నటీనటుల పనితీరు: మోహన్ లాల్ ను కంప్లీట్ యాక్టర్ అని ఎందుకు అంటారో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కొద్దిగా దృశ్యం ఛాయలు కనిపించినా, మాస్ హీరోల క్యారెక్టర్ లోని వీక్ నెస్ ప్రదర్శించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఈ సినిమాలో మోహన్ లాల్ బాత్రూంలో కూర్చుని గుండెలు అవిసేలా ఏడ్చిన సన్నివేశం ఎంతో హృద్యంగా, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే.. కామెడీ & యాక్షన్ విషయంలోనూ తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు మోహన్ లాల్.

శోభనను చాలారోజుల తర్వాత ఒక మంచి పాత్రలో చూడడం మంచి సంతృప్తినిచ్చింది. ఆమె పాత్రకున్న వెయిటేజ్ ను ఆమె క్యారీ చేసిన విధానం కూడా బాగుంది.

ఈ ఇద్దరి తర్వాత తన నటనతో విశేషంగా ఆకట్టుకున్న నటుడు ప్రకాష్ వర్మ. సిఐ జార్జ్ అనే పాత్రలో మంచితనం ముసుగులో క్రూరత్వాన్ని పండించిన విధానం బాగా వర్కవుట్ అయ్యింది. చాలా సింపుల్ గా ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ చివరికి వచ్చేసరికి పాశవికంగా వ్యవహరించడం అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రకాష్ వర్మకి నటుడిగా ఇదే మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే.

మోహన్ లాల్ కొడుకుగా థామస్ మాథ్యూ, కూతురుగా ఆర్ష చాందిని బైజులు ఒదిగిపోయారు. మరో పోలీస్ పాత్రలో బీను పప్పు, ఫర్హాన్ ఫాజిల్ లు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. వర్షం కారణంగా ఏర్పడిన బీభత్సాన్ని డ్రోన్ షాట్స్ తో కవర్ చేసిన విధానం, నైట్ షాట్స్ ను, లైటింగ్ ను మ్యానేజ్ చేసిన విధానం కచ్చితంగా ప్లస్ పాయింట్ అయ్యింది.

అలాగే.. ఆడియోగ్రఫీ వర్క్ & జేక్స్ బిజోయ్ సంగీతం సినిమాని బాగా ఎలివేట్ చేశాయి. ఓపెనింగ్ టైటిల్స్ లో AIను వినియోగించుకున్న విధానం కూడా బాగుంది.

దర్శకుడు తరుణ్ మూర్తి సినిమాను మొదలుపెట్టిన విధానం చాలా బాగుంది. ఒక హ్యాపీ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసి, వారి మధ్య అనుబంధాన్ని చాలా మెచ్యూర్డ్ గా ప్రాజెక్ట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఒక మాస్ హీరోను ఇంత సింపుల్ గా ప్రాజెక్ట్ చేసిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. అయితే.. తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. తన స్కూలుకి వెళ్లే కూతురు మీద మీడియా సాక్షిగా పడిన అబాండాలను క్లియర్ చేయకుండా, కేవలం తన పగ తీర్చుకోవడం అనేది ఎందుకో పొసగలేదు. ఆ హీరో అసలు చేయాల్సింది తన కుటుంబం మీద పోలీస్ వ్యవస్థ రుద్దిన మచ్చను తొలగించడం కదా, సింపుల్ గా ఫైట్ చేసి పగ తీర్చేసుకొవడం ఎంత వరకు కరెక్ట్ అనేది అర్థం కాలేదు.

బహుశా “దృశ్యం” సినిమా తాలూకు ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడకూడదు అని తీసుకున్న డెసిషన్ అయ్యిండొచ్చు కానీ.. అది సరైన ఎండింగ్ మాత్రం కాదు. ఎలివేషన్ వర్కవుట్ అయ్యింది కానీ.. ఎమోషన్ జస్టిఫై అవ్వలేదు. ఈ విషయంలో దర్శకుడు తరుణ్ మూర్తి వేరే తరహా ఎండింగ్ రాసుకుని ఉంటే బాగుండేది. ఇకపోతే.. సినిమాలోని ఏనుగుల కుటుంబాన్ని, హీరో కుటుంబంతో కంపేర్ చేస్తూ రిఫరెన్సులతో కథను, కథనాన్ని నడిపించిన విధానం మాత్రం బాగుంది. హీరోను గజరాజులా ప్రొజెక్ట్ చేసిన తీరు మంచి ఎలివేషన్ గా నిలిచింది.

విశ్లేషణ: “తుడరుమ్” కోర్ పాయింట్ ఎలివేట్ అయ్యేవరకు అద్భుతంగా నడిచే సినిమా. ఎప్పుడైతే ట్విస్ట్ రివీల్ అవుతుందో, మాస్ ఎలివేషన్స్ కి వెళ్ళిపోయి, కథలోని లాజిక్ & క్యారెక్టర్ ఆర్క్ ను పక్కకి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ ఫైట్ కోసం హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగున్నప్పటికీ.. నిజమైన న్యాయం పోలీసులను హతమార్చడం కాదు కదా, తన కుటుంబంపై పడ్డ నిందలను తొలగించడం కదా అనే ప్రశ్న తొలిచేస్తుంది. అందువల్ల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ మిస్ అయ్యింది. ఆ కారణంగా “తుడరుమ్” ఓ సగటు థ్రిల్లర్ లా మిగిలిపోయింది కానీ.. పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది.

ఫోకస్ పాయింట్: ఎలివేషన్ కోసం ఎమోషన్ మిస్ చేశారు!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus