‘క’ సినిమా ఇచ్చిన ఊపులో హీరో కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ అనే తన పాత సినిమాను తీసుకొచ్చి బొక్క బోర్లాపడ్డారు. హిట్ సినిమా వైబ్‌తో ఈ సినిమాను నడిపించేద్దాం అని అనుకున్నాడు. అయితే ఇప్పుడు రెండు యూత్‌ఫుల్ సినిమాలతో లైనప్‌ను స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్ నిర్మాతగా మారుదాం అనుకుంటున్నాడు. అది కూడా తెలుగులో గతంలో పెద్దగా వర్కవుట్ కాని ప్లానింగ్‌తో. దీంతో కిరణ్ ధైర్యమేంటి అనే చర్చ మొదలైంది.
తొలి రెండు సినిమాలు ‘రాజా గారు రాణీ గారు’, ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’తో మంచి విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత వరుసగా ఆరు ఫ్లాప్‌లు ఇచ్చాడు. ఫ్లాప్‌లు అనేకంటే డిజాస్టర్లు అనడం బెటర్. ఆయన కాబట్టి తట్టుకున్నాడు (ఎలా అనేది తెలియదు) కానీ.. ఇతరులకు చాలా కష్టమైన పరిస్థితి ఇది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ‘కె ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలు రెడీ చేసుకున్నాడు. ఇది కాకుండా సుకుమార్ శిష్యుడు, ‘పుష్ప’ సినిమా రైటర్ వీరా కొగటం దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు.
మరోవైపు త్వరలో తన బ్యానర్ నుండి ఓ ట్రయాలజీ మొదలు పెట్టబోతున్నాడు. మూడు కథలూ ఒకదానితో మరోటి సంబంధం ఉండేలా మూడు సినిమాలు చేస్తాడట. ‘ఉగాది రోజు’, ‘దీపావళి రోజు’, ‘రిలీజ్ రోజు’ అని ఆ సినిమాలకు పేరు కూడా అనుకుంటున్నారట. సినిమా పరిశ్రమ నేపథ్యంలోనే ఆ సినిమాల కథలు సాగుతాయట. మరి ఈ సినిమాలు థియేటర్ కోసమా లేక ఓటీటీ కోసమా అనేది తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని ఓటీటీలు తెలుగులో ఇలాంటి ట్రయాలజీలు తీశారు. కానీ అవి ఇబ్బందికర ఫలితాలు అందుకున్నారు.
మరిప్పుడు కిరణ్ అబ్బవరం ప్రయత్నం ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఆయన ప్లాన్ వర్కవుట్ అయితే మరికొంతమంది మేకర్స్, నిర్మాతలు ఇలాంటి ట్రయాలజీలు చేయడానికి ముందుకొస్తారు. మన దగ్గర కొత్త కంటెంట్ పుట్టుకొస్తుంది.