మలయాళంలో వచ్చిన మార్కో (Marco) సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించినా, తాజాగా ఇది తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమా హింసాత్మకత కారణంగా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. థియేటర్స్‌లో విజయం సాధించినా, టెలివిజన్ ప్రసారాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిషేధించడం చర్చనీయాంశమైంది.
CBFC రీజినల్ ఆఫీసర్ నదీమ్ తుఫైల్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, టీవీ ప్రసారంతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కూ అడ్డుకట్ట వేయాలని సూచించడం కలకలం రేపింది. చిన్న పిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు అనుకూలం కాదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. మేకర్స్ విడుదలకు ముందు దీన్ని “మోస్ట్ వయలెంట్ మలయాళ మూవీ”గా ప్రమోట్ చేయడం వల్లే ఇప్పుడు ఇది మరింత ట్రబుల్‌లో పడినట్లు కనిపిస్తోంది.
ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. “నా భార్యతో కలిసి సినిమా చూడడానికి వెళ్లాం. మొదటి భాగం వరకు ఓకే అనిపించింది. కానీ, ద్వితీయార్థంలో హింస డోస్ పెరగడంతో తట్టుకోలేక థియేటర్ నుంచి బయటకు వచ్చేశాం. అంత రక్తపాతం ఉంటుందని ఊహించలేదు. ఆమె గర్భవతి కావడంతో ఆ సినిమా మాకు అసహజంగా అనిపించింది,” అని చెప్పాడు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక గతంలోనే సినిమాపై వచ్చిన విమర్శలపై హీరో ఉన్ని ముకుందన్ కూడా స్పందించాడు. “సమాజంలో ఉన్న నిజమైన హింసతో పోలిస్తే మార్కో సినిమాలోని హింస 10% కూడా ఉండదు. ఇది కథకు అవసరమైనంతవరకే చూపించాం,” అంటూ సమర్థించుకున్నాడు. కానీ, ప్రేక్షకుల్లో చాలా మంది మాత్రం ఇది ఆడియన్స్‌పై మానసిక ప్రభావం చూపించేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. థియేటర్స్‌లో గ్రాండ్ సక్సెస్ అయినా, ఓటీటీలో మాత్రం మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
సినిమా కథ విషయానికి వస్తే, కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి జీవితంలో జరిగే ఘటనలతో ఇది సాగుతుంది. కథ కంటెంట్‌ను బట్టి హింస తప్పనిసరి అయినా, కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు కారణంగా ఇది కుటుంబ ప్రేక్షకులకు అస్సలు అనుకూలంగా లేదని చెప్పొచ్చు. సెన్సార్ బోర్డు టీవీలో ప్రసారం అనర్హమని తేల్చేయడంతో, ఛానెల్స్ ఈ సినిమాను ప్రసారం చేయడానికి వెనుకంజ వేయనున్నాయి.