“మిర్చి” తర్వాత రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా పూజా కార్యక్రమాలు సైతం మొదలుకొని కారణాంతరాల వలన ఆగిపోయింది. స్క్రిప్ట్ వర్కవ్వలేదని కొరటాల శివ సర్దిచెప్పగా, రామ్ చరణ్ మాత్రం స్క్రిప్ట్ నచ్చలేదు అందుకే కథ ఓకే చేయలేదు అని చెప్పేశాడు. ఆ తర్వాత “శ్రీమంతుడు, జనతా గ్యారేజ్”లతో హ్యాట్రిక్ హిట్ అందుకొని ప్రస్తుతం మహేష్ బాబుతో రెండో సినిమా “భరత్ అనే నేను” (వర్కింగ్ టైటిల్)ను తెరకెక్కిస్తున్న కొరటాల తన తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా కన్ఫర్మ్ చేశాడు. అయితే.. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ఫెయిల్ అవుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం 1985″లో నటిస్తున్న రామ్ చరణ్ ఆ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేద్దామనుకొన్నప్పటికీ సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీపడుతుండడం, “రంగస్థలం”కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కువగా ఉండడంతో తమ చిత్రాన్ని మార్చ్ కి పోస్ట్ పోన్ చేసుకొన్నాడు. ప్లాన్ ప్రకారమైతే సుకుమార్ సినిమా రిలీజవ్వగానే కొరటాల సినిమా మొదలెట్టాలి. కానీ.. ఎక్కడ ప్రోబ్లమ్ వచ్చిందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి బోయపాటి మధ్యలోకి వచ్చాడు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను దానయ్య నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది, నెక్స్ట్ ఇయర్ దసరాకు సినిమా రిలీజ్ కూడా అయిపోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ లెక్కల ప్రకారం కొరటాలతో రామ్ చరణ్ సినిమా మళ్ళీ ఆగిపోయిందనే అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ కాంబినేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో పరిశ్రమ పెద్దలకే తెలియాలి.