కొరటాల శివ వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నారు. రెండోసారి మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇద్దరి కలయికలో వచ్చిన భరత్ అనే నేను అత్యంత వేగంగా వందకోట్ల క్లబ్ లోచేరి రికార్డు సృష్టించింది. రోజుకో రికార్డు కొల్లగొడుతోన్న ఈ సినిమా గురించి అందరిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. అసలు రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ బాబుని ముఖ్యమంత్రి గా ఎలా ఊహించుకున్నారని ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన డైరక్టర్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ” ఈ కథను మహేశ్ బాబుతోనే చేయాలనుకోవడానికి కారణమేమిటని చాలామంది అడిగారు.
ఆయనైతేనే సరిగ్గా సరిపోతారని నేను నమ్మాను. ఎందుకంటే అనవసరంగా కోపం తెచ్చుకోని ముఖ్యమంత్రి పాత్ర ఇది. గొంతు పెంచి గట్టిగా మాట్లాడటం .. స్పీచ్ లు దంచేయడం ఈ పాత్రలో కనిపించవు. అవతలవారికి అర్థమయ్యేలా సూటిగా .. సున్నితంగా చెప్పే క్యారక్టర్ ఇది. ఈ లక్షణాలు మహేశ్ బాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయనను అనుకోవడం జరిగింది” అని కొరటాల వివరించారు. ఇంకా మాట్లాడుతూ.. “మహేశ్ కుదరదని చెప్పి ఉంటే ఈ సినిమాయే లేదు” అని స్పష్టం చేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా హౌసేఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.