తెలుగు వారు గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాస్ రావు. 74 ఏళ్లొచ్చినా నటిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అతని ఆరోగ్యంపై కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో ఆయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనీ, ఊపిరితిత్తులు సరిగా లేవనే ప్రచారాలపై కోట స్పందించారు. ఈ వార్తలను పుట్టిస్తున్న వారిపై మండిపడ్డారు. “ఎవరో హాస్పటల్‌లో ఉంటే నాలుగైదుసార్లు చూడ్డానికి వెళ్లితే చాలు.. నేనేదో హాస్పటల్ చూట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఇటీవలే సుశీలగారిపై, అంతకు ముందు కొందరిపై ఇలాంటి వదంతులే వచ్చాయి. మా ఆరోగ్యంతో బిజినెస్ చేస్తారా?” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ ‘‘కొందరు పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు.
వాళ్లకి ఎవరు చెప్పారు? ఇప్పుడు నాకు 74 ఏళ్లు. ఈ వయసులో కాళ్ల నొప్పులు, చేతి నొప్పులు ఉండవా? అది రోగమనుకుంటే ఎలా? డయాబెటిస్ వచ్చింది. ఈ వయసులో నాకు రాకూడదా? సాధారణంగా నా ఆరోగ్యం చాలా బాగుంది. 74 ఏళ్లొచ్చినా ఇంకా నటించే ఓపిక ఇచ్చాడని నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటా. ఎవరికైనా డౌట్ ఉంటే “హెల్త్ ఎలా ఉంది’ అని నన్నే అడగండి. అసత్య ప్రచారాల వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సహకరించాలి’’ అని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేశారు.