నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “కృష్ణ వృంద విహారి”. శౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ షిర్లే హీరోయిన్ గా నటించింది. “అలా ఎలా” ఫేమ్ అనీష్ ఆర్,కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాస్త లెట్ గా నేడు (సెప్టెంబర్ 23) థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో.. ఆచారవ్యవహారాలు పాలనలో పెరిగిన కుర్రాడు కృష్ణ (నాగశౌర్య). కుటుంబం, ఆచారాలు తప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తిత్వం అతడిది. అలాంటి కుర్రాడు ఉద్యోగం కోసం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరడం, వృంద అనే అమ్మాయిని తొలిచూపులోనే ఇష్టపడడం, ఆమెను పెళ్లాడాలని నిర్చయించుకోవడం అన్నీ టపీ టపీమని జరిగిపోతాయి. అయితే.. కృష్ణ పెళ్లి నిర్ణయానికి ఓ పెద్ద అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకిని కృష్ణ ఎలా చేధించాడు? తానూ ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: బ్రాహ్మణ యువకుడిగా.. అందంగా, ఒద్దికగా కృష్ణ పాత్రలో శౌర్య జీవించేసాడు. డైలాగ్ డెలివరీ & బాడీ లాంగ్వేజ్ విషయంలో “అదుర్స్” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను కొద్దిగా కాపీ కొట్టినట్లుగా కనిపించినా.. తనదైన మార్క్ స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. ఎమోషనల్ సీన్స్ లో చక్కని పరిణితి ప్రదర్శించాడు.
సింగర్ టర్నడ్ యాక్టర్ షిర్లే అందంగా కనిపించడమే కాక చక్కని నటనతో ఆకట్టుకుంది. అయితే.. లిప్ సింక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ నవ్విస్తుంది. బ్రహ్మాజీ సింగిల్ లైన్ పంచ్ లు ఒన్నాఫ్ ది హైలైట్.
సాంకేతికవర్గం పనితీరు: మహతి స్వరసాగర్ సంగీతం వినసొంపుగానే ఉన్నా.. పాటల్లో ఎక్కడో కొత్తదనం కొరవడింది. నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. సినిమాను చాలా కలర్ ఫుల్ గా చూపించడమే కాక.. చక్కని ఫ్రేమింగ్స్ తో కథను, ఎమోషన్స్ ను ఎలివేట్ చేసాడు. దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ రాసుకున్న కథ..
ఇటీవల విడుదలైన “అంటే సుందరానికి” చిత్రానికి చాలా దగ్గరగా ఉండడం సినిమాకి కాస్త మైనస్ అని చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ లో పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. కాకపొతే.. అనీష్ రాసుకున్న పంచ్ డైలాగులు, కామెడీ ట్రాక్ ఈ సినిమాను మాస్ ఆడియన్స్ ను ఇంకాస్త ఎక్కువగా అలరిస్తాయి. సో, కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు అనీష్. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే అవుట్ పుట్ ఇంకాస్త బెటర్ గా వచ్చేది.
విశ్లేషణ: చిన్నపాటి లాజిక్కులు, స్క్రీన్ ప్లేలో దొర్లిన తప్పులు పక్కనపెడితే.. “కృష్ణ వృందా విహారి” చిత్రం ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. శౌర్య స్క్రీన్ ప్రెజన్స్ & బ్రహ్మాజీ-వెన్నెల కిషోర్ ల కామెడీ సినిమాకి మంచి హైలైట్. సో, “అంటే సుందరానికి” పోలికను పక్కనపెట్టగలిగితే ఈ చిత్రాన్ని ఓ మోస్తరుగా బాగానే ఎంజాయ్ చేయగలరు.