‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాల్లో నటించింది. ఇవన్నీ కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యాయి. దీంతో కృతి శెట్టికి టాలీవుడ్లో అవకాశాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈమె చేతిలో మూడునాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘ది వారియర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను లింగుస్వామి డైరెక్ట్ చేశారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. ‘నా మాతృభాష తుళు. తెలుగులో కూడా బాగానే మాట్లాడతాను. ఇప్పటివరకు తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే కలిసి పని చేశాను. అయితే లింగుస్వామి గారు తమిళ దర్శకుడు కావడంతో భాష పరంగా కాస్త ఇబ్బంది పడ్డాను.
ఆయన తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం తెలియదు. దాంతో ఆయన మాట్లాడే తెలుగు అర్ధం అయ్యేది కాదు. ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడ్డాను. కానీ రామ్ కు తమిళ్ బాగా తెలుసు. ఆయన సపోర్ట్ తీసుకున్నాను. దర్శకుడు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ అర్ధమయేలా చెప్పేవారు.
ఆ తరువాత కొద్దిరోజులకు అలవాటు పడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది కృతిశెట్టి. ‘ది వారియర్’ సినిమాలో కృతిశెట్టి రేడియో జాకీగా కనిపించనుంది. ఈ రోల్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని చెబుతోంది కృతిశెట్టి.