హీరోలు మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలరా… హీరోయిన్లకు ఆ సత్తా లేదా? ఈ ప్రశ్న చాలా ఏళ్ల నుండి వినిపిస్తూనే ఉంది. దీనిపై చర్చ రెండు వైపులా బలంగా సాగుతూ ఉంటుంది. అయితే హీరోయిన్లు కూడా ఆ పని చేయగలరు అని హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు తరచుగా నిరూపిస్తూనే ఉంటాయి. మరోసారి అదే పని జరిగింది. అయితే ఈ సారి ముగ్గురు హీరోయిన్లు వచ్చి మాకు కూడా సాధ్యం అని నిరూపించారు. మేం చెబుతున్నది ‘క్రూ’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది.
టబు (Tabu) , కరీనా కపూర్(Kareena Kapoor) , కృతి సనన్ (Kriti Sanon) కలసి నటించిన చిత్రం ‘క్రూ’. ఈ సినిమా రూ.వంద కోట్లు వసూళ్లు దాటిన నేపథ్యంలో మీడియాతో కృతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘సినిమాలో ప్రధాన పాత్రధారిగా స్టార్ హీరో ఉంటేనే ప్రేక్షకుణ్ని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’’ అని కామెంట్ చేసింది. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కథ బాగుంటే.. ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఆడా? మగా? అని ఎవరూ చూడరు అని అంది.
సంజయ్‌లీలా భన్సాలీ – ఆలియా భట్ (Alia Bhatt) చేసిన ‘గంగూబాయి కాఠియావాడీ’లో కూడా హీరో లేడు. అయినా బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు అని గుర్తు చేసింది కృతి. వసూళ్లు కూడా అలానే వచ్చాయి అని చెప్పింది. ఇక తాను ప్రస్తుతం కాజోల్‌తో ‘దో పత్తీ’ అనే సినిమా చేస్తున్నానని అది కూడా నాయికా ప్రధాన చిత్రమేనని గుర్తు చేసింది.
అలాగే పరిశ్రమ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది కృతి. పరిశ్రమలో వ్యక్తులు మొహమాటానికి ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం కన్నా.. ఆపదల్లో ఉన్నవారికి అండగా నిలబడితే బాగుంటుంది అని కామెంట్ చేసింది. బాలీవుడ్‌లో సహ నటీనటుల మధ్య ఐక్యత నాకు అంతగా కనిపిచంలేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది సంతోషిస్తున్నారో. ఎంతమంది ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది.