సినిమాకు ఒక పేరు అనుకున్నాక.. మార్చడం అనేది సహజం. మన సినిమాల్లో ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే సినిమాకు ఓ పేరు పెట్టాక మార్పు జరగడం చాలా అరుదు. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిన్నప్పుడో, టైటిల్ పంచాయితీ వచ్చినప్పుడు మారుస్తుంటారు. అయితే సినిమా విడుదలైన ఎనిమిది నెలల తర్వాత ఓ సినిమా పేరు మార్చారు. అయితే అలా మార్చడానికి చాలా పెద్ద కారణమే ఉంది. దర్శక నిర్మాత కిరణ్ రావు (Kiran Rao) తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies).
Laapataa Ladies
ఈ సినిమా గురించి తొలుత తక్కువ మందికే తెలిసినా.. 2025 ఆస్కార్ పురస్కారాలకు మనదేశం నుండి అధికారికంగా ఎంపికవ్వడంతో అందరికీ తెలిసింది. ఆస్కార్‌లో ఎంట్రీ ఎంత ముఖ్యమో.. ప్రచారమూ అంతే ముఖ్యం. అక్కడ సినిమాను ఎంత బాగా ప్రచారం చేస్తే అవార్డు అవకాశాలు అంత మెరుగవుతాయి అంటారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ క్యాంపెయిన్‌ను ‘లాస్ట్ లేడీస్’ టీమ్ మొదలుపెట్టింది. అదేంటి ‘లాస్ట్ లేడీస్’ అంటున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే సినిమా కొత్త పేరు ఇదే కాబట్టి.
‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) అంటే అక్కడ అంతగా గుర్తుండకపోవచ్చు అనుకున్నారో, లేక ఇంగ్లిష్ టైటిల్ అయితే ఇంకా మంచి గుర్తింపు వస్తుందని అనుకున్నారో కానీ ‘లాపతా లేడీస్’ని ‘లాస్ట్ లేడీస్’ చేసేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేశారు.అంతర్జాతీయ చలన చిత్రాలు, డాక్యుమెంటరీ ఎంపికకు సంబంధించిన అకాడమీ సభ్యుల్లో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. వాళ్లు 80 శాతం సినిమాలను మాత్రమే చూస్తారు. అందులో మన సినిమా ఉండేలా చూసుకోవాలి అని నిర్మాతల్లో ఒకరైన ఆమిర్ ఖాన్ (Aamir Khan) చెప్పాడు.
‘లగాన్’ సినిమా సమయంలో మా సినిమా చూసిన వారికి టీ, బిస్కెట్లు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు ఆమిర్. 2001 కాలానికి చెందిన కథ ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ. ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది.