నేటి రోజుల్లో ఓ వయసు రాగానే బీపీ, షుగర్ అనేవి పిలవకుండానే వచ్చేస్తాయి. కానీ అవి ఎంత బాధను కలిగిస్తాయో, అవి ఉన్నవారికే తెలుస్తుంది. అటువంటి సున్నితమైన విషయాన్నీ ఎంతో ప్రేమగా కళ్లకు చుపించారు ఓంకారం శశిధర్. నంది అవార్డు గెలుచుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ తీసిన “లడ్డు..ఎ స్వీట్ మెమరీ” షార్ట్ ఫిల్మ్ మనసును టచ్ చేస్తుంది.
“వయసు పై పడిన జనార్దన్ కి మధుమేహం వ్యాధి వస్తుంది. దీంతో అతను స్వీట్ తినకుండా కొడుకు కోడలు జాగ్రత్త తీసుకుంటుంటారు. ఆయనకు ఇష్టమైన లడ్డు తినాలనే కోరిక నెరవేరిందా లేదా?” అనే కథతో తీసిన లఘు చిత్రం చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో “ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోరని ఏమో దేవుడు బీపీ షుగర్ లాంటివి తోడుగా పంపిస్తాడు”, “మనకిష్టమైన వస్తనువులు, పదార్ధాలు మనకిచ్చే ఆనందంకన్నా, మనతోటి మనుషులు మనకిచ్చే అనందం గొప్పదేమో ” వంటి మాటలు శశిధర్ పెన్ పవర్ కి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వయసు పై పడిన జనార్దన్ పాత్రలో రవి వర్మ చక్కగా జీవించారు. వెంకీ, మౌనిక, సుధీర్ బాబులు పాత్రలకు తగినట్లుగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. ఓ మంచి కుటుంభం కథ చిత్రాన్ని చూస్తున్న అనుభూతిని ఇస్తున్న “లడ్డు..ఎ స్వీట్ మెమరీ” షార్ట్ ఫిల్మ్ ని మీరు చూసి ఆ ఫీలింగ్స్ లో తడిసి ముద్దవ్వండి.