“జైలర్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రజనీకాంత్ ఓ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం “లాల్ సలామ్”. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ కథానాయకుడు. క్రికెట్ మరియు మత ఘర్షణల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 9) విడుదలవుతున్న విషయంలో రజనీకాంత్ డైహార్డ్ ఫ్యాన్స్ కు కూడా తెలియదు అంటే ఏస్థాయిలో ప్రమోట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. మరి అంత తక్కువ పబ్లిసిటీతో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!
కథ: గురు (విష్ణు విశాల్) & శంశుద్ధీన్ (విక్రాంత్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒక క్రికెట్ మ్యాచ్ కారణంగా రేగిన అల్లర్ల వల్ల శత్రువులుగా మారాల్సి వస్తుంది. అసలు ఈ గొడవలో మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) పాత్ర ఏమిటి? ఆయన ఈ గొడవలను ఎలా ఆపాడు? అనేది “లాల్ సలామ్” కథాంశం.
నటీనటుల పనితీరు: రజనీకాంత్ పాత్ర కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగా లేకపోవడం వల్ల.. సరిగా వర్కవుటవ్వలేదు. విష్ణు విశాల్, విక్రాంత్, తంబి రామయ్యలు కాస్త ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు కానీ.. సెంటిమెంట్ సీన్స్ లో బాగా మరిగిన సాంబార్ ను మన తెలుగు ప్రేక్షకులు రుచించుకోవడం కాస్త కష్టమే. తంబి రామయ్య మాత్రం కొన్ని సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. మిగతా క్యాస్టింగ్ అందరూ పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ సంగీతం, ప్రవీణ్ భాస్కర్ కెమెరా పనితనం బాగున్నప్పటికీ.. కనీస స్థాయి ఆసక్తి లేని కథనం వల్ల అవి ఎలివేట్ అవ్వలేదు. ఇకపోతే.. ఎస్.ఎఫ్.ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. ఆర్క్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ ను ఎలివేట్ చేశాయి. అయితే.. అసలు తప్పంతా రచయిత-దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ దే. ఏదో తండ్రి రజనీకాంత్ ఫ్రీగా నటిస్తున్నాడు కదా అని కథ-కథనం, సన్నివేశాల రూపకల్పన విషయంలో కనీస స్థాయి కేర్ తీసుకోలేదు. భీభత్సమైన ఎమోషన్ పండాల్సిన సన్నివేశంలో ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు అంటే..
రైటింగ్ అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా.. రజనీకాంత్ రక్తంతో తడిసిన కత్తిని చూపిస్తూ “ఇది ఏ మతస్తుడి రక్తం” అనే సన్నివేశం చాలా పేలవంగా ఉంది. ఇదే తరహా సన్నివేశం మణిరత్నం “బాంబే”లో చూసినప్పుడు మంచి ఆలోచింపజేస్తుంది, అదే సన్నివేశం రీసెంట్ గా వచ్చిన “ప్రిన్స్” సినిమాలో హిలేరియస్ ఫన్ జనరేట్ చేసింది. కానీ.. “లాల్ సలామ్”లో అదే తరహా సన్నివేశం మంచి ఎమోషన్ పండించకపోగా, హాస్యాస్పదంగా తెరకెక్కించడం అనేది ఐశ్వర్య పనితనానికి ప్రతీక.
విశ్లేషణ: రజనీకాంత్ మీద విపరీతమైన అభిమానం, థియేటర్లో కూర్చునే ఓపిక, సహనం వంటివి ఎంత పుష్కలంగా ఉన్నా “లాల్ సలామ్” (Lal Salaam) చిత్రాన్ని రెండున్నర గంటలపాటు థియేటర్లో చూడడం కష్టమే. అసలు నిర్మాతలు ఈ సినిమాని తెలుగులో ఎందుకు ప్రమోట్ చేయలేదో, థియేటర్ల నుండి బయటకు వస్తున్నప్పుడు అర్ధమవుతుంది.
రేటింగ్: 1.5/5