“కాటమరాయుడు” చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న కమల్ కామరాజు కథానాయకుడిగా తెరకెక్కిన హారర్ ఫిలిమ్ “లా” (లవ్ & వార్). మౌర్యాణి, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కాస్త అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ : రాధ (మౌర్యాణి) సినిమాలను కూడా చాలా సీరియస్ గా తీసుకోంటూ.. తెగ ఎమోషనల్ అయిపోయే రకం. అలాంటి సున్నిత మనస్కురాలైన ఆమె తన ఫ్రెండ్ అన్నయ్య విక్రమ్ (కమల్ కామరాజు)ను తొలిచూపులోనే ప్రేమిస్తుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకొంటారు. కానీ.. రాధ ఉండే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ఆమెతో కాస్త అసభ్యంగా ప్రవర్తించడం, అందుకు అతడ్ని ఆ అపార్ట్ మెంట్ లో కుర్రాళ్ళు కొట్టి మరీ గెంటేయడంతో.. వాచ్ మెన్ వెళ్ళిపోయిన తర్వాత వరుసబెట్టి హత్యలు జరుగుతుంటాయి.
ఈ హత్యలు అవమానించబడి వెళ్ళిపోయిన వాచ్ మెన్ చేస్తున్నాడా? లేక మరింకెవరైనా ఉన్నారా? అనేది “లా” కథాంశం.
నటీనటుల పనితీరు : బేసిగ్గా కమల్ కామరాజు మంచి నటుడే కానీ.. ఈ సినిమాలో అతడికి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ వల్లనో లేక దర్శకుడు సన్నివేశంలోని ఎమోషన్ ను సరిగా ఎక్స్ ప్లేన్ చేయకపోవడం వల్లనో సరిగా నటించలేకపోయాడు.
మౌర్యాణి అందంగా, పద్ధతిగా కనిపించింది, పాత్ర మేరకు చక్కగా నటించింది కానీ.. ఆమె క్యారెక్టర్ కు సరైన ఎలివేషన్ లేకపోవడంతో సినిమా చాలా కీలకమైనదైన ఆమె పాత్ర ప్రేక్షకులను మెప్పించలేదు సరికదా కనీసం ఆకట్టుకోలేదు.
పూజా రామచంద్రన్ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్.. అలాంటి పాత్ర ఫస్టాఫ్ లో ఎందుకు ఉందో అర్ధం కాదు. సెకండాఫ్ లో ఎప్పుడొచ్చి, ఎప్పుడేళ్లిపోతుందో ఐడియా ఉండదు. దాంతో ఆమె పాత్ర సినిమాలో ఎక్స్ట్రా గా మిగిలిపోయింది.
చాలా రోజుల తర్వాత మంజు భార్గవి ఆన్ స్క్రీన్ కనిపించినా.. మెప్పించలేకపోయింది. ఇక మిగతా పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సాంకేతికవర్గం పనితీరు : ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలు సమకూర్చడంతోపాటు దర్శకత్వం కూడా వహించిన గగన్ గోపాల్ ముల్కా ఆ నాలుగు శాఖల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అసలే కథ బాగోలేదనుకొంటే.. దానికి తోడు చీప్ ప్రొడక్షన్ వేల్యుస్ కారణంగా కనిపించే గ్రాఫిక్స్ & ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అప్పటికే నీరసించి ఉన్న ప్రేక్షకుడి సహనాన్ని ఇంకాస్త పరీక్షించాయి.
ఇక సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, డి.ఐ లాంటి సాంకేతికపరమైన విషయాల గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్.
విశ్లేషణ : హారర్ సినిమా అంటే.. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేస్తూ భయపెట్టడం అనేది కీలకమైన అంశాన్ని దర్శకుడు మర్చిపోవడంతో.. కుదిరినంత బోర్ కొట్టించి, చివర్లో చిరాకు తెప్పించే చిత్రంగా “లా” మిగిలిపోయింది.
రేటింగ్ : 0.5/5