Leela Vinodham Review in Telugu: లీలా వినోదం సినిమా రివ్యూ & రేటింగ్!

Leela Vinodham Review in Telugu: లీలా వినోదం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షణ్ముఖ్ జస్వంత్ (Hero)
  • అనఘా అజిత్ (Heroine)
  • గోపరాజు రమణరాజు, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు (Cast)
  • పవన్ సుంకర (Director)
  • శ్రీధర్ మరిస (Producer)
  • టి ఆర్ కృష్ణ చేతన్ (Music)
  • అనుష్ కుమార్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 19, 2024

సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ హీరోగా పరిచయమవుతూ నటించిన వెబ్ ఫిలిం “లీలా వినోదం”. పవన్ సుంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీధర్ మరిస నిర్మించగా.. ఈటీవీ విన్ యాప్ లో ఇవాళ (డిసెంబర్ 19) విడుదలై స్ట్రీమ్ అవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ ప్రపోజల్ స్టోరీగా తెరకెక్కిన ఈ వెబ్ ఫిలిం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Leela Vinodham Review in Telugu

కథ: ప్రతి చిన్న విషయాన్ని దీర్ఘంగా ఆలోచించేసి ఏదేదో ఊహించేసుకుని కంగారుపడిపోయే కుర్రాడు ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్). 2008లో డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లుగా తాను ప్రేమిస్తున్న వేరే బ్రాంచ్ అమ్మాయి లీలా (అనఘ అజిత్)కు ఇప్పుడైనా ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ప్రసాద్ స్లామ్ బుక్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కి స్వయంగా మెసేజ్ చేస్తుంది లీలా, సరదాగా ఈనాడు ఆదివారం సంచికలో వచ్చే పదవినోదాన్ని పూరిస్తూ.. సరదాగా మెసేజుల రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు.

ఎట్టకేలకు ఒకరోజు లీలాకి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ప్రసాద్. కానీ.. రెండు మూడు గంటలవుతున్నా అక్కడి నుండి రిప్లై రాదు. దాంతో ఏం జరిగి ఉంటుందా అని ప్రసాద్ చేసే హడావుడే ఈ “లీలా వినోదం”.

నటీనటుల పనితీరు: షణ్ముఖ్ జస్వంత్ నటనలో మంచి ఈజ్ ఉంటుంది. పల్లెటూరి యువకుడిగా అతడి బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ ప్రేక్షకుల్ని భలే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రసాద్ అనే పాత్ర అతిగా ఆలోచించడం అనేది అందరికీ కనెక్ట్ అయ్యే విషయం. హీరోయిన్ అనఘ అజిత్ కి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ.. కనిపించిన కాసేపు అందంగా ఆకట్టుకుంది. అలాగే కేరళ కుట్టి అయినప్పటికీ.. తెలుగు డైలాగ్స్ కి మంచి లిప్ సింక్ ఇస్తూ అలరించింది.

షణ్ముఖ్ తర్వాత తన టైమింగ్ తో ఆకట్టుకున్న మరో నటుడు మిర్చి ఆర్జే శరణ్. నిజానికి షణ్ముఖ్ కంటే ఎక్కువ డైలాగులున్నాయి అతడికి. మంచి ఈజ్ తో తన పాత్రకు న్యాయం చేయడమే కాక బాగా ఎంటర్టైన్ చేసాడు కూడా. తల్లి పాత్రల్లో ఆమని, రూపా లక్ష్మిలు పర్వాలేదనిపించుకొన్నారు. స్నేహితులుగా నటించిన వారందరూ నేచురల్ గా ఉన్నారు.

సాంకేతికవర్గం పనితీరు: అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ వెబ్ ఫిలింకి సహజత్వం తీసుకొచ్చింది. తణుకు అందాలను కథలో ఇనుమడింపజేశాడు. అలాగే.. హీరో పాత్ర ఊహించుకొనే సందర్భాలను, సన్నివేశాలను తెరకెక్కించిన విధానంలో టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా సింపుల్ గా ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో తెరకెక్కించడం అనేది ప్రశంసనీయం.

ఇక దర్శకుడు పవన్ సుంకర పనితనం గురించి మాట్లాడుకోవాలంటే.. ఒక చిన్న కథను ఎక్కువగా సాగదీయకుండా, హీరో పాయింటాఫ్ వ్యూలో సన్నివేశాలు అల్లుకుంటూ తెరకెక్కించిన విధానం ప్రశంసార్హం. ముఖ్యంగా హీరో ఊహించుకొనే సందర్భాల సీన్ కంపోజిషన్ బాగుంది. ఒక దర్శకుడిగా అతడి శైలి ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి అవి తార్కాణంగా నిలుస్తాయి. అలాగే.. సినిమాను ప్రపోజల్ దగ్గర ముగించడం అనేది బాగుంది.

ఒకమ్మాయిని ప్రేమిస్తూ.. మౌనంగా ఆ వ్యవహారాన్ని ఆస్వాదించడంలో ఉన్న ఆనందం, ఆ అమ్మాయి తిరిగి ప్రేమించినప్పుడు ఉండదు. ఈ పాయింట్ కు హీరో అతిగా ఆలోచించడం అనే కోణంలో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కాకపోతే.. సంభాషణలు మరీ ఎక్కువయ్యాయి, మరీ ముఖ్యంగా స్ట్రయిట్ స్క్రీన్ ప్లే కావడంతో.. ఒక పాయింట్ కి వచ్చాక హుక్ పాయింట్ ఏంటి అనేది లేకుండా నడిచిపోతుంది. మొత్తానికి ఒక దర్శకుడిగా, రచయితగా పవన్ సుంకరకు మంచి భవిష్యత్ ఉంది. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.

విశ్లేషణ: టైమ్ పాస్ కోసం చూసే సినిమాలు ఈమధ్య తగ్గిపోతున్నాయి. ప్రేక్షకుల్ని ఏదో సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేయాలనే అత్యుత్సాహంతో థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి. అలాంటి సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా తణుకులో ఓ యువ ప్రేమజంట ఒకర్ని ఒకరు ఎలా ప్రపోజ్ చేసుకున్నారు అనే మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన “లీలా వినోదం” కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అయితే.. ముందు చెప్పినట్లుగా మంచి టైమ్ పాస్ సినిమా ఇది, డ్రామాలు లేవు, సెంటిమెంట్లు లేవు. సో ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఈటీవీ విన్ యాప్ లో చూసేయొచ్చు.

ఫోకస్ పాయింట్: మంచి వినోదాన్ని పంచే లీలా దేవి నిద్ర, ప్రసాద్ బాబు ఆత్రం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus